హైదరాబాద్: సెంట్రల్ వర్సిటీ వ్యవహారంపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాత్రమే కాదని, కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ కూడా తమ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చెప్పటంపై వీహెచ్ వివరణ ఇచ్చారు. ఢిల్లీలో స్మృతి ఇరాని ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే వీహెచ్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ తాను 2014 నవంబర్ నెలలోనే లేఖ రాశానని వీహెచ్ గుర్తు చేశారు. యూనివర్సిటీలో ఏడుగురు దళిత విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, యూనివర్సిటీలో అక్రమాలు, అవినీతి వల్ల నిధులు దుర్వినియోగమవుతున్నాయని, విలువలు పడిపోతున్నాయని తాను లేఖలో పేర్కొన్నానని చెప్పారు. దానిపై మంత్రిత్వ శాఖ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తాను లేఖ రాసిన విషయాన్ని మాత్రమే స్మృతి ఇరాని చెప్పారని, దానిలోని విషయాలను మాత్రం చెప్పలేదని మండిపడ్డారు. దత్తాత్రేయను తప్పించేందుకే తన పేరును లాగుతున్నారని ఆరోపించారు. తన లేఖకు, దత్తాత్రేయ లేఖకు చాలా తేడా ఉందని అన్నారు.
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలపై వ్యాఖ్యానిస్తూ హైదరాబాద్లో నలుగురు మంత్రులు ఉంటే ఒక్కరే హీరో అయ్యారని వీహెచ్ అన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆరా, కేటీఆరా అని ప్రశ్నించారు.