తెలంగాణలో ముందస్తు వస్తుందన్న అంచనాలతో అన్ని రాజకీయ పార్టీలూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. అధికార పార్టీలో ఎన్నికల సందడి బాగానే కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా టి. కాంగ్రెస్ కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో తాజా పరిస్థితిపై, ముందస్తు ఎన్నికలు వస్తే తదనుగుణంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించడం కోసం అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి ఢిల్లీకి రమ్మంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిలుపు వచ్చింది. దీంతో ఉత్తమ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ముందస్తు ఎన్నికలు వస్తే ప్రాథమికంగా ఏం చెయ్యాలన్నదానిపై కొంత చర్చ జరుగుతున్నట్టు సమాచారం! దీంతోపాటు పార్టీ ప్రచార కమిటీతోపాటు, కొన్ని కమిటీలను వేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే, ఓపక్క తెరాస సిద్ధమౌతోంది కాబట్టి… తాము కూడా సమరానికి సంసిద్ధం అవుతున్నామనే అభిప్రాయం కలిగించాలన్నది టి. కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది.
ఇదే సమయంలో సీనియర్ నేత వీ హన్మంతరావు అలిగినట్టుగా సమాచారం! పార్టీలో కొత్తగా వచ్చినవారికి ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప, ఎప్పట్నుంచో ఉన్న సీనియర్లను గౌరవం లేకుండా పోతోందని ఆయన ఢిల్లీలో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రచార కమిటీ ఛైర్మన్ గా తనను నియమించాలంటూ వీహెచ్ ఓపెన్ గానే డిమాండ్ చేశారు. దాని కోసం తాను సర్వం సిద్ధం చేసుకున్నాననీ, ఒక బస్సును తన సొంత సొమ్ముతో కొని సిద్ధం చేసుకున్నానని కూడా వీహెచ్ అన్నారట! ఆ ప్రచార రథంతో రాష్ట్రమంతా పర్యటిస్తాననన్నారంటున్నారు. అంతేకాదు, తనకు ప్రచార కమిటీ బాధ్యతలు ఇవ్వకపోతే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తోంది.
నిజానికి, ఈ ప్రచార కమిటీ పదవిని రేవంత్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం ఆ మధ్య బాగా జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఈ ప్రతిపాదన తెరమీదికి వచ్చింది. రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం, రేవంత్ భుజం మీదే తెలంగాణ కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు పెడతారూ, ఆయనే స్టార్ కేంపెయినర్ అంటూ బాగానే ఊదరగొట్టారు. కానీ, అవన్నీ కొన్నాళ్లపాటు వార్తలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇప్పుడు తనకే ఆ పదవి కావాలంటూ వీహెచ్ డిమాండ్ చేస్తుండం విశేషం..! ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.