రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్టు ప్రకటించబోతున్నారు అనగానే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొంత మందికి పూనకాలొచ్చేస్తారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని అనుకుంటారో… లేక ఇతర పార్టీలకు ఇబ్బంది అవుతుందని అనుకుంటారో.. లేక తమకు రాజకీయ ప్రాధాన్యం ఉండదని భయపడతారో కూడా… పేరు గొప్ప సీనియర్లు కూడా.. పార్టీ పరువును బజారున పడేయడానికి కూడా వెనుకాడరు. ఈ కోవలో.. వీహెచ్, జగ్గారెడ్డి లాంటి వాళ్లు ముందు ఉంటారు. జగ్గారెడ్డి అయినా కాస్త డీసెంట్‌గా ఉంటారేమో కానీ.. కాంగ్రెస్‌లోనే పుట్టి పెరిగానని… గాంధీ కుటుంబానికి విధేయుడ్నని చెప్పుకునే వీహెచ్ మాత్రం.. ఏ మాత్రం తగ్గడం లేదు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వొద్దంటూ ఆయన రగడ ప్రారంభించారు.
రేవంత్ రెడ్డిని తిడుతూ.. మీడియా ముందు అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. బీసీలకు పీసీసీ చీఫ్ ఇవ్వాలని రెడ్లకుఇవ్వాలనుకుంటే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఇవ్వాలని ఆయన తేల్చి చెప్పారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయితే గాంధీభవన్‌కు ఎవర్నీ రానివ్వడని.. ఇప్పుడే తనను ప్రెస్‌మీట్ పెట్టనీయడం లేదని ఆయన మండిపడ్డారు. ఒక వేళ పీసీసీ చీఫ్ పోస్టును రేవంత్‌కు ఇస్తే.. తర్వాత ఆయన జైలుకు వెళ్తే పరిస్థితేమిటని వీహెచ్ ప్రశ్నిస్తున్నారు. రేవంత్ వర్గీయులు ఫోన్ చేసి దూషిస్తున్నారని చెప్పుకొచ్చారు.
కారణం ఏమిటో కానీ.. రేవంత్ రెడ్డిపై వీహెచ్ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఆయనను పీసీసీ చీఫ్ గా వద్దని అంటున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ కాకుండా… సొంత పార్టీలోని నేతలతో పాటు ఇతర పార్టీలు కూడా… వ్యూహం పన్నుతున్నాయని… విశ్లేషణలు వస్తున్న తరుణంలో వీహెచ్ లాంటి వారి రగడ.. కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడదనడానికి వీహెచ్ లాంటి వారు చేస్తున్న రచ్చనే సాక్ష్యమని కొందరు తేల్చి చెబుతున్నారు.