ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక కమిటీలను అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే! అయితే, మిగతా కమిటీల నియామకం ఎలా ఉన్నా… ప్రచార కమిటీ బాధ్యతలకు సంబంధించి కొంత చర్చ చాలారోజుల నుంచి జరుగుతోంది. ఎందుకంటే, ముందుగా దీన్ని రేవంత్ రెడ్డికి ఇస్తారన్న ప్రచారం ఆయన పార్టీలో చేరినప్పట్నుంచీ వినిస్తున్నదే. అయితే, ఈ మధ్య సీనియర్ నేత వీ హన్మంతరావు కూడా ఈ ఛైర్మన్ పదవి మీద బాగానే ఆశలు పెట్టేసుకున్నారు. ఆ మధ్య ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా తానే కాబోయే ప్రచార కమిటీ ఛైర్మన్ అన్నట్టుగా వ్యవహరించారు కూడా! ఇప్పటికే ఒక బస్సు కొన్నాననీ, ప్రచారానికి అంతా సిద్ధం చేసుకున్నాననీ, పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం అన్నట్టుగా మాట్లాడారు. తన పేరును పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిపాదించారనీ ఈ మధ్య ఓ ప్రెస్ మీట్ లో చెప్పేశారు కూడా!
కానీ, ఇప్పుడా పదవి మల్లు భట్టి విక్రమార్కకు ఇచ్చారు! అంతే… విషయం అధికారికంగా వెల్లడి కాగానే వీహెచ్ తీవ్రంగా అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. తనకు వేరే కమిటీ బాధ్యతలు అప్పగించడం పట్ల కూడా ఆయన అసంతృప్తితో ఉన్నారట! దీంతో ఆయన గాంధీభవన్ నుంచి అలిగి వెళ్లిపోయారనీ, కొంతమంది ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే… పట్టించుకోలేదని తెలుస్తోంది! కమిటీల నియామకంలో ఎవరో జోక్యం చేసుకున్నారనీ, తన పేరును ఎవరు మార్చారు, ఎందుకు మార్చారు… అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట! అంతేకాదు, ఈ నియామకాలపై తాను నేరుగా హైకమాండ్ తో మాట్లాడతాననీ, రాష్ట్ర నేతలతో చర్చించి అనవసరం అంటూ వీహెచ్ మండిపడ్డట్టు సమాచారం. తనకు ప్రచార కమిటీ రాకుండా కొందరు అడ్డుకున్నారంటూ ఆయన ఆరోపించారు!
తాజాగా నియమించిన కమిటీల్లో కాస్త జూనియర్లను ఛైర్మన్లు చేయడం, సీనియర్లను సభ్యులుగా ఉంచడం పట్ల కూడా సీనియర్లలో కొంత అసంతృప్తి వ్యక్తమౌతున్నట్టు సమాచారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కీలక కమిటీ వస్తుందని ఆశించారు. దక్కకపోవడంతో ఆయనా కొంత అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది. అయితే, ఈ కమిటీల ప్రకటనలకు ముందే.. కొద్దిమంది నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమౌతుందని ఏఐసీసీ ముందుగానే ఊహించిందనీ, ఈ పరిస్థితి వచ్చిన వెంటనే రంగంలోకి దిగాలనే వ్యూహంతోనే ఉందనీ సమాచారం. కాబట్టి, వీహెచ్ తో వీలైనంత త్వరగా చర్చలూ బుజ్జగింపులూ ఉంటాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. సీనియర్లు ఎవ్వరూ మీడియా ముందు మాట్లాడొద్దనీ, సమస్యలుంటే నేరుగా పీసీసీకి, లేదా రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కి చెప్పాలని అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించిన సంగతి తెలిసిందే. కానీ, తాజా నియామకాల నేపథ్యంలో వ్యక్తమౌతున్న అసంతృప్తులు మళ్లీ ఢిల్లీకి చేరే అవకాశమే కనిపిస్తోంది!