కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు చాలా ఆసక్తికరమయిన ప్రతిపాదన ఒకటి చేసారు. అదేమిటంటే తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ నేతలు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవాలని. తెలంగాణాలో తెదేపా మనుగడ సాగించడం కష్టమనే సంగతి ఇప్పటికే స్పష్టమయింది కనుక తెదేపా నేతలు తెరాసలో చేరేకంటే కాంగ్రెస్ పార్టీలో చేరడమే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, తెరాసల మధ్యనే ఉంటుంది కనుక తెరాసను ఓడించాలని తెదేపా నేతలు భావిస్తున్నట్లయితే అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవాలని ఆయన సలహా ఇచ్చారు.
ఓటుకి నోటు కేసు బయటపడక ముందు వరకు కూడా తెలంగాణాలో తెదేపాలో చాలా బలంగానే ఉండేది. కానీ ఆ తరువాత చంద్రబాబు నాయుడు విజయవాడకు తరలివెళ్లిపోవడం, తెలంగాణాలో పార్టీని పట్టించుకోకపోవడం, అదే సమయంలో తెదేపా నేతలను తెరాసలోకి ఆకర్షించడం మొదలయినప్పటి నుండి తెలంగాణాలో తెదేపా బలహీనపడసాగింది. గ్రేటర్ ఎన్నికల తరువాత పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పుడు తెలంగాణాలో తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక్కరే పార్టీని రక్షించుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడుతోంది. కానీ ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆయన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనబడటం లేదు.
కనుక పార్టీలో మిగిలిన నేతలు కూడా ఏదో ఒక రోజు వేరే పార్టీలలోకి వెళ్లిపోవచ్చును. ప్రస్తుతం తెరాసలో బయట పార్టీల నుండి వచ్చిన వారితో కిటకిటలాడుతోంది కనుక ఇకపై తెదేపా నేతలకు తెరాసలో చోటు దక్కకపోవచ్చును. దక్కినా వారికి పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కే అవకాశాలు తక్కువ. రేవంత్ రెడ్డి వంటి నేతలయితే తెరాసలోకి వెళ్ళలేరు. బీజేపీలో వెళ్ళినా ఇమడగలరో లేదో తెలియదు. బహుశః ఇవ్వన్నీ దృష్టిలో పెటుకొనే హనుమంత రావు ఇటువంటి ప్రతిపాదన చేసారేమో?
తెరాస పార్టీ తెలంగాణాలో తెదేపా ఉనికిని సహించలేకపోతోంది కానీ నేటికీ కాంగ్రెస్ జోలికి వెళ్ళడం లేదు. ఒకవేళ వెళ్ళినా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా సార్లు ఎదుర్కొని బయటపడింది కనుక ఈసారి కూడా బయటపడవచ్చును. కనుక ఆయన చేసిన ఈ ప్రతిపాదనపై తెలంగాణా తెదేపా నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.