కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం పశ్చాత్తాపం కొన్నాళ్ల ముందే వచ్చి ఉంటే ఆ పార్టీ పరిస్థితి ఇవాళ ఎంతో దివ్యంగా ఉండేదే ఏమో! పార్టీ సర్వనాశనానికి దారితీసే నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత వగచి విచారించి.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టినట్లుగా ‘అప్పట్లో తప్పు చేశాం’ అంటూ నాలిక్కరచుకోవడం ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారుతున్నట్లుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెసు పార్టీ నాశనం అయిపోయిన పరిణామాల గురించి కొన్నాళ్ల కిందట ఆ పార్టీ కేంద్ర నాయకులు ‘విభజన అనుకూల నిర్ణయం తీసుకుని తప్పుచేశాం’ అని వ్యాఖ్యానించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే తరహా పశ్చాత్తాపానికి నిదర్శనంగా ఇప్పుడు ‘హైదరాబాదు నగరంలో మజ్లిస్ ను పెంచి పోషించినందుకు కాంగ్రెసు పార్టీకి తగిన శాస్తి జరిగింది’ అని ఆ పార్టీ సీనియర్ ఎంపీ వీ హనుమంతరావు వ్యాఖ్యానిస్తున్నారు. కాటు వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నాగు పాము పాలు పోసిన చేతిని ఉపేక్షించదనే సత్యం అందరికీ తెలిసిందే. కాకపోతే.. తమ స్వానుభవంలోకి వస్తే గానీ తత్వం బోధపడదన్నట్లుగా.. కాంగ్రెస్ నేతలకు మజ్లిస్ విషయంలో ఒకప్పుడు తాము చారిత్రక తప్పిదం చేశామని ఇప్పుడు బోధపడుతున్నట్లుగా ఉంది.
ఒకప్పట్లో కాంగ్రెసు పార్టీ మజ్లిస్‌ను అనవసరంగా నెత్తిన పెట్టుకున్నదనే చెప్పాలి. పాతబస్తీలో ఇతర పార్టీల అస్తిత్వం నామమాత్రంగా మారిపోయేలా.. ఎంఐఎం విచ్చలవిడిగా వ్యవహరించగలిగేలా ఒక దుర్మార్గమైన వాతావరణాన్ని అప్పట్లో కాంగ్రెస్ పాలకులు, తమతమ స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సృష్టించి వదిలేశారు. దానికి తగ్గట్లుగానే గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మజ్లిస్‌తో కాంగ్రెస్ పొత్తులు కూడా పెట్టుకుని మేయర్ పీఠాన్ని అనుభవించింది. ఆ పార్టీతో కలిసి కుర్చీని పంచుకున్నది. ఇలా వారితో తమ ఆప్తమిత్రుల పార్టీలాగానే అంటకాగింది. అయితే ఎంఐఎం మాత్రం.. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పట్ల పెడసరపు ధోరణితోనే ఉంటూ వచ్చిందని చెప్పాలి. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ఎంఐఎం ఆటలు వారు ఆడినట్టల్లా సాగలేదు.
విభజన నేపథ్యంలో ఎంఐఎం ఊతం మీద గద్దెను సుస్థిరంగా కాపాడుకోవడానికి మేయర్ విషయంలో తమ హవా సృష్టించుకోవడానికి తెరాస వారికి పాలుపోసి పెంచుతూ.. తమ వారిగా ముద్రవేయడం ప్రారంభించింది. వారూ అధికారం లేని కాంగ్రెసును వదిలించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెసు నాయకుల్నే చితక్కొట్టారు. ఇప్పుడు మజ్లిస్‌ను తామే పెంచిపోషించిన వైనం పై వీహెచ్ పశ్చాత్తాప పడుతున్నారు. ప్రస్తుతం మజ్లిస్ మీద ఆధారపడుతున్న తెరాస కూడా అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ఇవాళ తమకు పట్టిన గతే రేపు వారికి కూడా తప్పదని వీహెచ్ హెచ్చరిస్తున్నారు. అయినా ఈ బుద్ధి పాముకు పాలు పోసినప్పుడే ఉండాలి. పాలు పోసినంత కాలమూ దేవుడని మొక్కి కాటువేసినప్పుడు ఏడిస్తే ఏంలాభం అని జనం అనుకుంటున్నారు.