‘వి’ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని చాలామంది నిర్మాతలు ఆసక్తిగా ఎదురు చూశారు. అమేజాన్ తో పాటు మిగిలిన ఓటీటీ సంస్థలూ… `వి`పై బాగా ఫోకస్ చేశాయి. కారణం సింపుల్. ఈ సినిమా రిజల్ట్ ని బట్టి – తమ సినిమాల్ని ఓటీటీలకు ఇచ్చుకోవాలా వద్దా? అనే విషయంలో నిర్మాతలకు ఓ క్లారిటీ వస్తుంది. అటు ఓటీటీ సంస్థలకు సైతం… `పెద్ద సినిమాలు కొనాలా, వద్దా` అనే విషయంలో ఓ నిర్ణయానికి రావొచ్చని.
`వి` పెద్ద సినిమా. దాదాపు 33 కోట్లకు ఈ సినిమాని అమేజాన్ కొనేసింది. అంటే.. సినిమా బడ్జెట్ ఓటీటీ ద్వారా వచ్చేసినట్టే. అసలు సినిమాలు విడుదల అవుతాయా? కావా? ఆ డబ్బులు నిర్మాతకు ఎప్పుడు తిరిగొస్తాయి? అనే సందేహాల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్న వేళ, ఓటీటీ ద్వారా ఓ ఆదాయ మార్గం దొరకడం నిజంగానే ఓ అనుకోని వరం. లాభాల మాట పక్కన పెడితే, పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న భరోసాని ఓటీటీ వేదిక కల్పించింది.
`వి`లాంటి పెద్ద సినిమాని, ఇంత భారీ మొత్తం వెచ్చించి అమేజాన్ కొన్నదీ అంటే.. మిగిలిన సినిమాలూ అటు వైపు దృష్టి సారించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఓటీటీ వైపు కొత్త సినిమాలు ప్రవాహంలా వచ్చి పడిపోయే ఛాన్సుంది. కానీ.. `వి` రిజల్ట్ బాగా తేడా కొట్టేసింది. ఈ సినిమాపై విపరీతమైన నెగిటీవ్ ట్రోలింగ్. ఇంట్లో ఫ్రీగా అమేజాన్ లో సినిమా చూసేద్దాం అనుకున్న వాళ్లు సైతం.. ఆ ట్రోలింగ్ లకు భయపడి, `వి` వైపు చూడని పరిస్థితి. ఈ సినిమా రిజల్టు తెలుసుకొని, సబ్ స్రైబ్ చేసుకుందాం అనుకున్న వాళ్లు సైతం.. లైట్ తీసుకున్నారు. `వి` కోసం కొత్త గా చేరిన సబ్ స్రైబర్లు ఎంత మంది అన్న లెక్క.. అమేజాన్ దగ్గర తప్పకుండా ఉంటుంది. అయినా.. అమేజాన్ టార్గెట్, ఈ సినిమాతోనే 33 కోట్లు సంపాదించేద్దాం అని కాదు. తన దగ్గర కంటెంట్ బ్యాంక్ పెంచుకోవడానికి, ఉన్న సబ్ స్కైబర్లని కాపాడుకోవడానికి ఇలాంటి సినిమాలు కొనడం అవసరం.
కాకపోతే.. ఇక ముందు కొత్త సినిమాల్ని కొనడానికి మాత్రం అమేజాన్ లాంటి సంస్థలు ఆచి తూచి అడుగులేస్తాయి. ఇంతింత పెద్ద మొత్తంలో ఆఫర్లు ఇవ్వకపోవొచ్చు. సినిమా రిజల్ట్ తేడా కొడుతుందేమో అని, ముందుగానే భయపడి తమ సినిమాని ఓటీటీకి అమ్మేసుకుందాం అనుకున్న వాళ్లకు.. ఇప్పుడు చుక్కెదురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే సినిమాల్ని ఓటీటీలకు ఇచ్చుకోవడానికి నిర్మాతలు రెడీగా ఉన్నా, ఓటీటీ సంస్థలు మాత్రం – తమ సినిమాల్ని కొనడానికి సిద్ధంగా లేకపోవొచ్చు. ఎందుకంటే..`వి` ఎఫెక్ట్ అలాంటిది. నిశ్శబ్దం, గుడ్ లక్ సఖీ, సోలో బతుకే సో బెటరు.. ఇవన్నీ దాదాపుగా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిపోయాయి. ఇవన్నీ మెల్లమెల్లగా ప్రమోషన్లు ప్రారంభించుకుని, విడుదలకు సమాయాత్తం అవ్వబోతున్నాయి. వీటిలో ఒకటో రెండో – హిట్టయితే తప్ప, మళ్లీ ఓటీటీ మార్కెట్ పై ఆశలు చిగురించవు.