అన్ లాక్ ప్రక్రియలో భాగంగా థియేటర్ల తాళాలు తెరచుకుంటున్నాయి. మెల్లమెల్లగా సినిమాలూ వచ్చేస్తున్నాయి. అయితే.. ముందు పాత సినిమాల్ని వేసి ఓ ట్రైల్ వేద్దామనుకుంటున్నారు నిర్మాతలు. పాతవి అంటే మరీ పాతవి కాదు. ఓటీటీలో వచ్చి, థియేటర్లలో రాని సినిమాల్ని విడుదల చేసే యోచనలో ఉన్నారు. ఓటీటీలో విడుదలైన `వి`, `ఒరేయ్ బుజ్జిగా` లాంటి సినిమాలు ఇప్పుడు థియేటర్లలోనూ రానున్నాయి. `వి` ఈనెల 18న `ఒరేయ్ బుజ్జిగా` జనవరి 1న విడుదల కానున్నాయి.
అయితే ఇవి రెండూ ఓటీటీలో ఉన్నాయి. విడుదలై కూడా చాలా రోజులైంది. పైగా ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న సినిమాలు. ఇప్పటికీ ఓటీటీలో ఫ్రీగానే చూడొచ్చు. సినీ గోయర్స్ విడుదలైన రోజే ఈ సినిమాని ఓటీటీలో చూసేశారు. బీసీ సెంటర్లలో, మరీ ముఖ్యంగా ఓటీటీ వేదికలంటే పెద్దగా పరిచయం లేని చోట.. నాని సినిమా అంటే కాస్తో కూస్తో బజ్ ఉండొచ్చు. కాకపోతే.. ‘ఆ సినిమా ఫ్లాపట్రా..’ అనే విషయం వాళ్లకెప్పుడో తెలిసిపోయి ఉంటుంది. అలాంటి సినిమాల్ని.. ఇప్పుడు డబ్బులిచ్చి చూస్తారా, అందులోనూ.. కరోనా భయాల మధ్య? పాత సినిమాల్ని ఇప్పుడు ఎన్ని వేసినా ప్రయోజనం ఉండదు. అసలు సినిమాలు చూసే ఆసక్తి జనాలకు ఉందా? లేదా? అనేది తెలియాలంటే.. కొత్త సినిమాని వదలాల్సిందే. అయితే ఆ రిస్క్ మాత్రం ఎవ్వరూ చేయడం లేదు.