రాజకీయ లక్ష్యాలతో.. ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ.. డొలాయమాన స్థితిలో ఉన్నారు. ఏ పార్టీలో చేరాలో నిర్ణయించు కోలేకపోతున్నారు. నిజానికి తన వాలంటరీ రిటైర్మెంట్ ఆమోదం పొందిన రోజునే.. ఆయన కార్యాచారణ ప్రారంభించారు. రెండు, మూడు నెలల పాటు.. ఏపీలో విస్తృతంగా తిరిగి వివిధ వర్గాల సమస్యలపై ఓ ఎజెండా రూపొందించుకున్నారు. ఆ తర్వాత సొంత పార్టీ పెట్టాలని ఆలోచించారు. ఇతర పార్టీలు ఆహ్వానిస్తే ఆలోచిస్తానన్నారు. బీజేపీ, జనసేన పార్టీలు మాత్రమే ఆహ్వానించాయని… ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని గతంలో ప్రకటించారు. ఓ సందర్భంలో.. లోక్సత్తా పార్టీని మళ్లీనడుపుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన సైలెంటయిపోయారు.
ఇప్పుడు ఎన్నికల ప్రకటన కూడా వచ్చేయడం.. తొలి విడతలోనే ఎన్నికలు జరుగుతూండటంతో.. ఆయన సొంత పార్టీ ఆలోచనలు… ఇక ముందుకు సాగే అవకాశం లేదు. అందుకే.. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు.. టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. భీమిలీ నుంచే పోటీ చేయవచ్చని..సూచించారు. దీనిపై..వీవీ లక్ష్మినారాయణ.. ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయలేదు. తన అభిప్రాయాన్ని తర్వాత చెబుతానని మాత్రమే చెప్పినట్లు తెలుస్తోంది. తన రాజకీయ రంగ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానాలేనని.. వీవీ లక్ష్మినారాయణ ప్రకటించారు. అయితే… టీడీపీలో చేరబోతున్నాననే.. విషయాన్ని మాత్రం ఆయన ఖండించలేదు. దాంతో.. చర్చలు జరుగుతున్నాయని అనుకోవచ్చంటున్నారు. తాను టీడీపీలో చేరితే… జగన్ కేసుల దర్యాప్తుపై విమర్శలు వస్తాయని ఆయన అనుకుంటున్నట్లుగా.. ప్రచారం జరుగుతోంది. నిజానికి అలాంటి భావం ఉంటే.. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేయకూడదని అంటున్నారు. ఎందుకంటే.. రాజకీయం అంటే.. అన్ని రకాల విమర్శలు వస్తాయి.. తట్టుకోవాలని అంటున్నారు.
వీవీ లక్ష్మినారాయణని టీడీపీలో చేర్చుకోవాలని.. తెలుగుదేశం పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో తటస్థుల ఓట్లు కీలకంగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. వీవీ లక్ష్మినారాయణ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు పార్టీలో చేరితే తటస్తులను ఎక్కువగా ఆకర్షించవచ్చని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. వీవీ లక్ష్మినారాయణను పార్టీలోకి తీసుకునేందుకు సీరియస్గా ప్రయత్నిస్తోంది. అసెంబ్లీకి రావాలనుకుంటే భీమిలీ, పార్లమెంట్ కు వెళ్లాలనుకుంటే.. విశాఖ స్థానం ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్న సూచనలు పంపుతున్నారు.