‘తొలిప్రేమ’ టైటిల్లో ప్రేమ ఉంది. శుక్రవారం (ఫిబ్రవరి 2న) విడుదల చేసిన ట్రైలర్ చూస్తే సినిమాలో ఎంత ప్రేమ ఉంటుందో అర్థమవుతోంది. ఈ సినిమాను ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14కు ముందు వచ్చే శుక్రవారం విడుదల చేయాలనుకున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమారుడు. అదే రోజున (శుక్రవారం, ఫిబ్రవరి 9న) ‘ఇంటిలిజెంట్’ సినిమానూ విడుదల చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందులో హీరో సాయిధరమ్ తేజ్. మెగా మేనల్లుడు. మొదట్లో ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమా వెనక్కి వెళ్తుందని ఇండస్ట్రీలో జనాలు చాలామంది అనుకున్నారు. కానీ, రెండూ ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ‘ఇంటిలిజెంట్’ 9న, ‘తొలిప్రేమ’ 10న విడుదల కానున్నాయి.
మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజున, ఒకే వారంలో విడుదల కావడం అంత మంచిది కాదని, రెండిటికీ వారం రోజులు గ్యాప్ ఉంటే బాగుంటుందని డిస్కషన్స్ నడిచాయి. లవ్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి ‘తొలిప్రేమ’ వాలంటైన్ వీక్‌లో రావడం కరెక్ట్ అని మధ్యవర్తులుగా వ్యవహరించిన కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట! వారం లేదా రెండు వారాల తర్వాత ‘ఇంటిలిజెంట్’ వస్తే బాగుంటుందని చెప్పారు. సాయిధరమ్ తేజ్, చిత్రనిర్మాత సి. కళ్యాణ్ తమకు ఎలాంటి సమస్య లేదని అన్నారట! కానీ, దర్శకుడు వీవీ వినాయక్ మాత్రం ఈ ప్రతిపాదనలకు ఒప్పుకోలేదని టాక్. వారం కాదు, ఒక్క రోజు వెనక్కి వెళ్ళడానికి కూడా వినాయక్ అంగీకరించలేదట.
ఎంత మంది చెప్పినా ఎన్ని డిస్కషన్స్ నడిచినా వినాయక్ మాట, పట్టుదల మారకపోవడంతో చివరకు ‘తొలిప్రేమ’ టీమ్ ఒక్క రోజు తర్వాత రావాలని నిర్ణయించుకున్నారని ఫిలింనగర్ టాక్. వినాయక్‌ను గట్టిగా ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి. మెగా ఫ్యామిలీకి బాగా కావలసిన వ్యక్తి. చిరంజీవి రీ-ఎంట్రీ ఫిలిం ‘ఖైదీ నంబర్ 150’ దర్శకుడు. ఆ సినిమా తర్వాత దర్శకత్వం వహించిన సినిమా ‘ఇంటిలిజెంట్’. పోనీ ఆ సినిమాతో కలిపి ‘తొలిప్రేమ’ను విడుదల చేయడానికి థియేటర్స్ సమస్య ఉంది. మోహన్ బాబు ‘గాయత్రి’ కూడా అదే రోజున వస్తోంది. చివరకు, మరో ఆప్షన్ లేక సినిమా కాన్సెప్ట్, కథకు మ్యాచ్ అయ్యే వాలంటైన్ వీక్‌ను వదులుకోవడం ఇష్టం లేక ఫిబ్రవరి 10న ‘తొలిప్రేమ’ను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ డేట్ మారడం వెనుక బోలెడు తతంగం, హంగామా నడిచాయట.