కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందరికీ వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించుకుంది. రాష్ట్రాలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా… టీకాలు ఇస్తామనిచెప్పింది. అంత వరకూ బాగానే ఉంది. అయితే హఠాత్తుగా.. కేంద్రం వ్యాక్సిన్ విధివిధానాలను మార్చేసింది. 18 ఏళ్ళు పైబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా అనేది రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చిన కేంద్రం… పంపిణీని ఏ లెక్కలో చెపట్టాలో కూడా మార్చేసింది. వైరస్ తీవ్రత, జనాభా, వ్యాక్సినేషన్ పురోగతి ఆధారంగా రాష్ట్రాలకు టీకాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. గతంలో జనాభా ఆధారంగా పంపిణీ చేసేవారు. ఇప్పుడు.. వ్యాక్సిన్ వేస్టేజ్ ఎక్కువగా చేసే రాష్ట్రాలకు తక్కువగా కేటాయించనున్నారు.
వ్యాక్సిన్ల సరఫరాపై ఆయా రాష్ట్రాలకు ముందే కేంద్రం సమాచారం ఇస్తుంది. వ్యాక్సిన్ లభ్యత సమాచారం పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం పంపే వ్యాక్సిన్ డోసులను ఏ రాష్ట్రమైనా వృధా చేస్తే..దాని ప్రభావం తదుపరి కేటాయింపులపై వుంటుందని కొత్త మార్గదర్శకాలలో వెల్లడించింది. వ్యాక్సిన్ తయారీదారుల నుంచి 75 శాతం స్టాక్‌ని కేంద్ర ప్రభుత్వం సేకరించనున్నది. కొత్తగా ప్రకటించిన పారామీటర్స్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఏ రాష్ట్రానికి ఏ మేరకు వ్యాక్సిన్లను కేటాయించాలనే విషయాన్ని కేంద్రం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయాలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఎందుకంటే… ఉచితంగా ఇచ్చే వ్యాక్సిన్లు.. వివిధ కారణాలు చూపి… బీజేపీ పాలిత రాష్ట్రాలు.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు ఎక్కువగా తరలిస్తారని అనుమానిస్తున్నారు. ప్రైవేటు రంగానికి ఇరవై ఐదు శాతం వరకూ సప్లయ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందున బీజేపీ శీతకన్ను వేసిన రాష్ట్రాల్లో ప్రజలకు కొనుగోలు చేసుకునేవే ఎక్కువగా అందుబాటులో ఉండే ప్రమాదం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే… జనాభా ప్రకారం ఇస్తున్నామని చెప్పినప్పుడే.. పెద్ద ఎత్తున… టీకాలు.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళ్లాయి. ఇప్పుడు రూల్స్ మార్చేసిన తర్వాత ఇక బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు ఎంత మేర వెళ్తాయో చూడాలి..!!