రూ. పదహారు వందల కోట్ల ఖర్చు పెడితే ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని.. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రజల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారని అంటున్నారు. మరో వైపు ప్రభుత్వం అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. వ్యాక్సిన్ విధానం పూర్తిగా కేంద్రం వద్ద ఉంది. కేంద్రం ఎంత చెబితే.. అంత కొనుగోలు చేయాలి తప్ప.. ఇష్టం వచ్చినట్లుగా కొనుగోలు చేయడాని కి లేదని చంద్రబాబుకు తెలీదా అని ప్రెస్మీట్లు పెట్టి మరీ.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ వెంటనే కౌంటర్ ఇస్తోంది.
వ్యాక్సిన్ కంపెనీల వద్ద యాబై శాతం కేంద్రం తీసుకుంటుందని.. మిగతా యాభై శాతం రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకునేందుకు పర్మిషన్ ఇచ్చిందని.. అనేక రాష్ట్రాలు ఆర్డర్లు పెట్టుకుని కొనుగోలు చేస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆర్డర్లు పెట్టిన రాష్ట్రాలకు టీకాలు ఇస్తున్నారని.. అదే సమయంలో.. ఏపీ సర్కార్ లేఖలు మాత్రమే రాసిందని.. ఆర్డర్లు పెట్టలేదని అంటోంది. అయితే ఈ వాదనను..ప్రభుత్వం తోసి పుచ్చింది. రాష్ట్రాలకు ఎంత వ్యాక్సిన్ ఇవ్వాలో మొత్తంగా కేంద్రమే నిర్ణయిస్తోందని వాదిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ వ్యాక్సిన్ వివాదం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. అధికార పార్టీ అసహనానికి గురై.. కేసులు పెట్టే ప్రయత్నం చేస్తోంది.
చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబుపై దేశద్రోహం కేసులు పెట్టాలని మండిపడ్డారు. బహుశా.. ఏపీ హోంశాఖ ఆయన కనుసన్నల్లోనే ఉందని ప్రచారం జరుగుతున్నందున.. రేపో మాపో… ప్రతిపక్ష నేతలపై.. దేశద్రోహం కేసులు పెట్టినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీకాల వెనుక రాజకీయం చాలా జరుగుతోంది కానీ.. అసలు.. టీకాల విధానంలో ఎవరు చెబుతోంది నిజం అన్నది మాత్రం.. బయటకు రానీయడం లేదు.