ఒకటో తేదీ నుంచి పద్దెనిమిదేళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. అసలు వ్యాక్సిన్ ఎక్కడి నుంచి వస్తుందన్నది యిప్పుడు సస్పెన్స్ ధ్రిల్లర్‌గా మారింది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. కానీ వారికి కూడా సరిపోవడం లేదు. వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే.. చక చకా వేయడానికి ప్రభుత్వ సిబ్బంది.. వేయించుకోవడానికి జనం కూడా రెడీగా ఉన్నారు. ఎక్కడ చూసినా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కానీ.. వ్యాక్సిన్ నిల్వలే ఉండటం లేదు. రెండు డోసులు వేస్తేనే వ్యాక్సిన్ పూర్తి సామర్థ్యం మేరకు.. యాంటీ బాడీస్‌ను అభివృద్ధి చేస్తుంది. కానీ.. కనీసం మొదటి డోస్ వేసుకున్న ఇరవై శాతం మందికి కూడా రెండో డోస్ ఇవ్వలేకపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పద్దెనిమిదేళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తోంది. రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే.. వ్యాక్సిన్ వేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అనూహ్యంగా రిజిస్ట్రేషన్లు ఉండే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికి ఎప్పట్లోపు వ్యాక్సిన్ వేస్తారనేది ఇప్పుడు కీలకం. ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ ప్రారంభించడానికి కొన్ని కోట్లడోసులు కావాల్సి ఉంటుంది. ఒక్కో రాష్ట్రానికి పది లక్షల డోసులు అయినా అందుబాటులో ఉంచకపోతే… వ్యాక్సిన్ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరుగుతుంది. ఇది ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు తీసుకు వస్తుంది. దేశంలో ఇప్పటికైతే రెండే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవిషీల్డ్ కాగా.. మరొకటి కోవాగ్జిన్. ఈ రెండు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ .. సగం కేంద్రానికి ఇస్తుంది.
వాటిలో రాష్ట్రాలకు ఎన్ని ఇస్తుందో తెలియదు. మిగతా సగం రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయవచ్చు. అయితే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఉచితంగా ఇవ్వాలని అనుకుంటున్నాయి. దీంతో రెండు కంపెనీలకు ఇబ్బడిముబ్బడిగా ఆర్డర్లు వస్తున్నాయి. ఎంత మేర డిమాండ్‌ను తీరుస్తారన్నది సందేహాస్పదం. ఎలా చూసినా.. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే.. ఒకటో తేదీ నుంచి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే.. కరోనా సమస్యల్లో చిక్కుకుపోయినా ప్రజలకు మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టినట్లవుతుంది.