కరోనా సమయంలో…. చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ఏర్పాటైంది. చిత్రసీమలోని కార్మికులకు… సీసీసీ మూడు నెలల పాటు నిత్యావసర వస్తువుల్ని అందించింది. ఇప్పుడు మరోసారి సీసీసీ యాక్టీవ్ కాబోతోంది. ఈ విషయంలో చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. సీసీసీ ద్వారా సినీ కార్మికులకు వాక్సిన్స్ వేయించే ఆలోచన ఉందని, త్వరలో అందుకు సంబంధించిన కార్యక్రమాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. సీసీసీ ఫండ్ లో కొంత మొత్తం ఇంకా మిగిలే ఉందని, దాన్ని ఉపయోగించి వాక్సినైజేషన్ చేయించే కార్యక్రమం చేపడతామని అన్నారు చిరంజీవి. `వైల్డ్ డాగ్` సినిమాకి అభినందలు తెలపడానికి ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీసీసీ ప్రస్తావన వచ్చింది. “ఎలాంటి వ్యాక్సిన్ వేయించుకోవాలి? దాని కోసం ఏం చేయాలి? అనే విషయంలో కార్మికులకు కొంత గందరగోళం ఉంది. అందుకే…. ఓ కార్యక్రమం ద్వారా అందరికీ ఉచితంగా వాక్సిన్లు వేయిద్దామనే ఆలోచన ఉంది. దాని గురించి త్వరలో చెబుతాం“ అని వ్యాఖ్యానించారు చిరు. సీసీసీ భవిష్యత్తులోనూ యాక్టీవ్ గా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.