చంద్రబాబు ప్రభుత్వ విధానాలను విమర్శించేవాళ్లకు సహజంగానే ‘సాక్షి’ పత్రికలో చాలా ప్రాధాన్యత దక్కుతుంది. ప్రత్యేకించి భూముల వ్యవహారంతో గతంలో తను ప్రవచించిన విధానానికి, ఇప్పుడు అనుసరిస్తున్న విధానానికి ఏ మాత్రం పోలిక లేకుండా చేసి చంద్రబాబు కూడా జగన్ పత్రికకు కావాల్సినంత మ్యాటర్ ను అందించాడు. ప్రత్యేకించి రైతులతో ముడిపడిన అంశం, లక్షల ఎకరాల భూముల వ్యవహారం కావడంతో.. ఈ వ్యవహారంలో రాసుకోవడానికి చాలా అవకాశమే లభిస్తోంది. అయితే ఎంత సేపూ తనే రాస్తే.. తన వైపు నుంచినే విమర్శలు వస్తే ఉపయోగం ఉండదు.. అనేది సాక్షి వాళ్లకు తెలియనిదేమీ కాదు!
అందుకే కొంతమంది న్యూట్రల్ పర్సన్లను కూడా ఉపయోగించుకుంటోంది ఈ పత్రిక. అందుకు ఉదాహరణ.. వడ్డే శోభనాద్రీశ్వరరావు. ఒకప్పుడు బాబు కేబినెట్ లో మంత్రిగా చేసిన ఈయన తను ఇప్పటికీ తెలుగుదేశం వాడినే అని అంటున్నాడు. అయితే భూ సేకరణ విధానాల విషయంలో బాబు తీరును తీవ్రంగా తప్పుపడుతున్నాడు ఈ నేత. దీంతో సాక్షి పత్రికలో ఆయనకు చాలా ప్రాధాన్యత దక్కుతోంది. రాజధాని భూముల వ్యవహారం, బందరు పోర్టు వ్యవహారం.. వంటి విషయాల్లో కూలం కషంగా ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వడ్డే శోభనాద్రిశ్వరరావు రాసిన వ్యాసాలను సాక్షిలో ప్రత్యేకంగా ప్రచురించారు. ఆయన బైలైన్ తో.. ఆయన ఫొటోను పెట్టి మరీ ఆయన వ్యాసాన్ని ప్రచురించారు. ఇది వరకూ కొంతమంది కమ్యూనిస్టు పార్టీ నేతల విమర్శనాత్మక వ్యాసాలను కూడా సాక్షి ఎడిటోరియల్ పేజీలో ప్రత్యేకంగా ప్రచురించడం జరిగింది. ఇప్పుడు ఈ తెలుగుదేశం నేత వ్యాసాలను కూడా ఉపయోగించేసుకుంటున్నట్టుగా ఉన్నారు!