హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల నుంచి మొదలుకొని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విష్ణు దేవాలయాలన్నింటిలో నేటి అర్థరాత్రి వైకుంఠద్వారాన్ని తెరువనున్నారు. ముఖ్యంగా తిరుమలలో శ్రీవారి దేవాలయానికి ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఇవాళ అర్ధరాత్రినుంచి ద్వాదశి నాడు అంటే 22వ తేదీ అర్ధరాత్రివరకు 48 గంటలపాటు ఈ ఉత్తర ద్వారం తెరిచి ఉంటుంది. తిరుప్పావై పారాయణ అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు ఉత్తర ద్వారం తెరుస్తామని, తెల్లవారు ఝామున 1.30 గంటలనుంచి వీవీఐపీలు, వీఐపీలకు దర్శనం కల్పిస్తామని, తెల్లవారుఝామున 4 గంటలనుంచి సర్వదర్శనం ప్రారంభిస్తామని ఈవో సాంబశివరావు చెప్పారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యమిస్తామని అన్నారు. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. వీవీఐపీలు, వీఐపీలకు నేరుగా వస్తేనే దర్శనం కల్పిస్తున్నామని, సిఫార్సు లేఖలు తీసుకోవటం లేదని చెప్పారు. భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని అన్నారు.