సూపర్ డూపర్ హిట్టిచ్చిన డైరెక్టర్ ఖాళీగా ఉన్నాడంటే ఏంటోలా ఉంటుంది. బుచ్చిబాబుని చూస్తున్నా అదే ఫీలింగ్. ఉప్పెనతో రూ.50 కోట్ల సినిమా ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్ తొలి సినిమాని హిట్ చేసి, తన కెరీర్‌కి బాటలు వేశాడు. కృతి శెట్టి లాంటి కథానాయికని ఇండ్రస్ట్రీకి అందించాడు. మొత్తానికి అరంగేట్రం అదిరింది. కానీ రెండో సినిమానే ఎంతకీ తేలడం లేదు. ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ కథ రాసుకున్నాడు బుచ్చిబాబు. కానీ ఎన్టీఆర్ కి ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతోంది.
ఈలోగా వైష్ణవ్ తేజ్ తోనే మరో సినిమా చేయాలని ఫిక్సయ్యాడు. మైత్రీ మూవీస్ లోనే వైష్ణవ్ – బుచ్చి బాబు కాంబో ఖాయమైంది. అయితే ఇప్పుడు వైష్ణవ్ ఫుల్ బిజీ. తను చేసిన `కొండపొలెం` రిలీజ్ కి రెడీ అయ్యింది. ఆ తరవాత.. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ సినిమా చేయాల్సివుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఇలా రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. వీటి మధ్య.. బుచ్చిబాబుకి డేట్లు ఇవ్వడం కష్టంగా ఉందట. అందుకే.. ఇప్పుడు మరో హీరోని వెదికే పనిలో పడ్డాడు బుచ్చిబాబు. ఓ యంగ్ హీరోతో… బుచ్చి సినిమా త్వరలోనే ఫైనల్ కానుందని టాక్. ఆ హీరో ఎవరన్నది ఇంకొద్ది రోజుల్లో తెలుస్తుంది.