సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తోంది మైత్రీ మూవీస్. దర్శకుడు సుకుమార్ సారథ్యంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఓ రియల్ లవ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా కోసం కథ తయారుచేసినట్లు తెలుస్తోంది. ఆర్ ఎక్స్ 100 మాదిరిగా రియలిస్టిక్ అప్రోచ్ తో సాగే కాస్త రఫ్ గా వుండే నెరేషన్ తో ఈ సినిమా వుంటుందని తెలుస్తోంది.
ఓ ఫిషర్ మన్ లవ్ స్టోరీగా ఈ సినిమా తయారుకాబోతోందని, పూర్తి రియలిస్టిక్ అప్రోచ్ తో వుంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సినిమా మొత్తం కోస్తా బెల్ట్ నేఫథ్యంలో వుంటుందని తెలుస్తోంది. సుకుమార్ కాకినాడ లాంటి కోస్తా ఏరియాల్లో పనిచేసి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో జరిగిన ఓ లవ్ స్టోరీ లోని పాయింట్ ఆధారంగా ఈ స్టోరీని తయారుచేయిచారని టాక్.
పూర్తిగా యూత్ ఫుల్ గా, కాంటెంపరరీగా వుండేలా, ఆర్ ఎక్స్ 100, అర్జున్ రెడ్డి మాదిరిగా కాస్త రఫ్ గా వుండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో పక్కా నేటివ్ స్టయిల్ లో ఓ బీట్ ఐటమ్ సంగ్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.