మెగా ఇంటి నుంచి ఓ హీరో వస్తున్నాడంటే.. అంది చూపూ అతనివైపే ఉంటుంది. చిరంజీవిలా డాన్సులు చేస్తాడా? పవన్ కల్యాణ్‌లా హైపర్ గా ఉంటాడా? బన్నీలా స్టైలీష్ గా ఉంటాడా? ఇవే.. అంచనాలు. వాటన్నింటినీ తట్టుకోవడం చాలా కష్టం. ఎంట్రీ సులభంగా దొరికేసినా – చాలా కష్టపడాలి. అలాంటి కష్టమే పడుతున్నాడు వైష్ణవ్ తేజ్. చిరు మేనల్లుడిగా, సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా `ఉప్పెన`తో ఎంట్రీ ఇస్తున్నాడు వైష్ణవ్. ఈనెల 12 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తో చిన్న చిట్ చాట్ ఇది.
* మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో మీరు. ఇంట్లో ఉన్న వాతావరణమే.. ఇటువైపు లాక్కొచ్చిందా?
– అదేం లేదండీ. నిజానికి నాకు యాక్టింగ్ అంటే అంత ఇష్టం లేదు. సినిమాల వైపు రావాలని అనుకోలేదు. ఫొటోగ్రపీ నేర్చుకోవాలనుకున్నాను. చిత్రలేఖనం వైపు వెళ్దామనుకున్నా. మిలటరీలో చేరి దేశానికి సేవ చేద్దామనుకున్నా. ఇలా చాలా ఆలోచనలు ఉండేవి. కానీ సరైన దారి కనిపించలేదు. ఓ సారి ఇన్స్ట్రా గ్రామ్‌లో సరదాగా రెండు ఫొటోలు పెట్టా. వాటిని చూసి చాలా ఆఫర్లు వచ్చాయి. `మా సినిమాలో నటిస్తారా` అంటూ ఇంటికొచ్చి కథలు చెప్పడం మొదలెట్టారు. అప్పటికీ నా మైండ్ సెట్ క్లియర్ కాలేదు.
ఓసారి చిరంజీవి మావయ్యకి ఇదే సంగతి చెప్పా. `వచ్చిన అవకాశాన్ని గౌరవించాలి. వదులుకోకు.. ప్రయత్నించి చూడు` అన్నారు. సరిగ్గా… అప్పుడే ఉప్పెన కథ వచ్చింది.
* చిన్నప్పుడు బాల నటుడిగా చేసేశారు కదా. మరి అప్పటి అనుభవాలేంటి?
– చిన్నప్పటి నుంచీ నటిస్తూనే ఉన్నా. సరదాగా మావయ్యలు షూటింగులకు నన్ను తీసుకెళ్లేవారు. `నీకు కావల్సిన ఆటబొమ్మలు కొనిస్తాను..` అని ఆశ చూపించి కల్యాణ్ మావయ్య `జానీ` సినిమాలో నన్ను నటుడ్ని చేసేశారు. పెదమామ `కళ్లార్పకుండా చూస్తూనే ఉండగలవా?` అన్నారు. సరే అన్నాను. నన్ను చూసి… `శంకర్ దాదా`లో ఛాన్సిచ్చారు. అప్పుడు యాక్టింగ్ లో ఉండే సీరియస్‌నెస్ తెలీదు. చిన్నప్పుడు ఏం అనుకుంటే అది చేసేస్తాం.. కదా.. అలా చేసేసేవాడిని. పెద్దయ్యాక నాపై అంత నమ్మకం ఉండేది కాదు. తెరపై హీరోలు డాన్సులు, ఫైట్లూ చేస్తుంటే చూస్తుండిపోయేవాడ్ని. అలా డాన్స్ చేస్తానా? ఏడుస్తానా? డైలాగులు చెబుతానా? అనుకునేవాడ్ని. అందుకే సినిమాల గురించి ఆలోచించలేదు. ఓ ఆడియన్ లా సినిమాని ఎంజాయ్ చేస్తా. కానీ తెరపై కనిపిస్తా అని ఎప్పుడూ అనుకోలేదు.
* ఉప్పెన కథ విని చిరంజీవిగారు ఏమన్నారు? సినిమా చూశాక ఏమన్నారు?
-చ ఉప్పెన కథని ముందు మావయ్యకే వినిపించాం. `మట్టి కథ ఇది. నువ్వు చేస్తే బాగుంటుంది` అన్నారు. సినిమా చూశాక….`నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది` అని మెచ్చుకున్నారు. ఆ క్షణంలో నిజంగానే ఏదో సాధించానన్న తృప్తి కలిగింది.
* నటనకు సంబంధించిన శిక్షణ తీసుకున్నారా?
– భిక్షు యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నా. కానీ సెట్లో నేర్చుకున్నదే ఎక్కువ. ఉత్తరాంధ్ర యాస గురించి నెల రోజులు ట్రైనింగ్ తీసుకున్నా. బుచ్చి గారు చాలా మంచి సంభాషణలు రాశారు. వాటిని పాడు చేయకూడదన్న ఉద్దేశంతో.. డైలాగులు పలకడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టా.
* ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఇది. కరోనా వల్ల ఆగిపోయింది. ఆ సమయంలో తొలి సినిమాకే ఇలా అయ్యిందేంటి? అని టెన్షన్ పడలేదా?
– ఆ టైమ్ లో అందరి పరిస్థితీ ఇంతే కదా? జనాల గురించి ఆలోచించాల్సిన టైమ్ అది. సినిమాల గురించి ఏం ఆలోచిస్తాం?
* తొలి సినిమా రాకుండానే రెండో సినిమా కూడా మొదలెట్టారు కదా?
– అవును… రెండు సినిమాలకూ మధ్య ఆరు నెలల గ్యాప్ వచ్చింది. క్రిష్ సినిమా సెట్స్ కి వెళ్తుంటే.. అన్నీ మర్చిపోయి, మళ్లీ కొత్తగా నేర్చుకుంటున్నట్టు అనిపించింది. రెండూ మట్టిలోంచి పుట్టిన పాత్రలే. బాగా ఎంజాయ్ చేశా.
* మూడో సినిమా కూడా ఫిక్సయిపోయిందట..
– అవును. దర్శకుడు, నిర్మాత, కథ.. అన్నీ ఫిక్స్. కానీ.. ఆ ప్రాజెక్టు ఏమిటన్నది సరైన సమయంలో ప్రకటిస్తా.
* అన్నయ్య సాయిధరమ్ తేజ్ అందించిన ప్రోత్సాహం ఎలాంటిది?
– తొలిరోజు నుంచీ అన్న సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. `బాగా కష్టపడాలి.. సెట్లో కామ్ గా ఉండొద్దు.. ఏదోటి నేర్చుకుంటూనే ఉండాలి` అని చెప్పేవాడు. అదే చేశా.
* బేసిగ్గా ఎలాంటి సినిమాలంటే ఇష్టం?
– యాక్షన్ సినిమా అంటే ఇష్టం. గన్స్… ఫైట్స్ ఉన్న సినిమాల్ని బాగా ఇష్టపడతా. మిలటరీ బ్యాక్ డ్రాప్లో సాగే ఓ కథ వస్తే… ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను.
* చదువులెలా సాగాయి?
– పీజీ చేశాను. డిగ్రీలో మాస్ కమ్యునికేషన్. పీజీ ఇంగ్లీష్ లిటరేచర్. అమ్మ కోసమే ఆ సర్టిఫికెట్. అమ్మ కోసమే చదివా. సర్టిఫికెట్ రాగానే తన చేతిలో పెట్టేశా.
* ట్రైలర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది కదా.. ఆయనేం చెప్పారు?
– ఎన్టీఆర్ అన్న చాలా సపోర్ట్ చేశారు. చాలా హైపర్ గా ఉంటారు. ఓరోజు సడన్ గా ఫోన్ చేసి `నా పేరు ఎన్టీఆర్.. మా ఇంటికి వస్తావా` అన్నారు. క్షణాల్లో ఆయన ముందు వాలిపోయా. సొంత తమ్ముడిలానే ట్రీట్ చేశారు.
* పరిశ్రమలో స్నేహితులు ఎవరు?
– మనోజ్ అన్న చాలా మంచి ఫ్రెండ్. ఎన్టీఆర్లానే హైపర్ గా ఉంటారు. నన్ను ఓ తమ్ముడిలా చూస్తుంటారు. నాతో నే కాదు.. అన్నయ్యతోనూ అలానే ఉంటారు.
* ఉప్పెన క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో చాలా వార్లలొస్తున్నాయి. అంత స్పెషల్ గా అందులో ఏముంది?
– సోషల్ మీడియాలో ఉప్పెన క్లయిమాక్స్ గురించి వస్తున్న రకరకాల కథనాలు నేనూ చదివా. ఒకటి మాత్రం చెప్పగలను. క్లైమాక్స్ చాలా గొప్పగా, పవిత్రంగా ఉంటుంది. షాక్ కి గురవుతారు. ఈ సినిమాకి క్లైమాక్స్ మరో లెవల్ కి తీసుకెళ్తుంది.
* విజయ్ సేతుపతిలాంటి స్టార్ తో నటించారు కదా. ఆ అనుభవం ఎలా వుంది?
– విజయ్ సేతుపతి తో నటించడం.. అద్భుతమైన అనుభవం. సెట్లో చాలా నార్మల్ గా ఉంటారు. చిన్న స్టూల్ పై కూర్చుని సాధారణ వ్యక్తిగా గడుపుతారు. షూటింగ్ చివరి రోజు.. అందరికీ మంచి విందు ఇచ్చారు. ప్రధాన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికీ ఆయన వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చారు.