అవినీతి, అధికారంపైన ఆశ, సొంత వాళ్ళందరికీ దోచిపెట్టాలన్న కక్కుర్తి లాంటి విషయాల్లో మన నాయకులను మించినవాళ్ళు ప్రపంచంలో వేరే ఎక్కడైనా ఉన్నారా అంటే చెప్పలేం. ఒకవేళ ఉన్నామన నాయకులు కప్పిపుచ్చుకున్నంత సమర్థవంతంగా తప్పులను కప్పిపుచ్చుకోవడం మాత్రం వాళ్ళకు వచ్చి ఉండదు.
సమైక్యాంధ్ర ఉద్యమ కాలంలో సమైక్యాంధ్ర కోసం పోరాడతామని రాజకీయ వీరులెందరో ముందుకు వచ్చారు. అప్పటికే తెలంగాణా ఇచ్చేయాలన్న నిర్ణయం జరిగిపోయిందనుకోండి. తెలంగాణా రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ప్రజల ముందుకు వెళ్ళడానికి సీమాంధ్ర నాయకులకు మొహం చెల్లదు కదా? అందుకే సమైక్యాంధ్ర డ్రామా మొదలెట్టారు. ఆ డ్రామాలో ఒక భాగం ఎంపి, ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేయడం. మామూలుగా అయితే స్పీకర్ ఆమోద ముద్ర ఎప్పటికీ పడకుండా ఉండేలా రాజీనామా చేయడంలో మనవాళ్ళు సిద్ధహస్తులు. కానీ ఆ విషయాన్ని సొంత భజన మీడియా సమర్థించినా ప్రత్యర్థి మీడియా ఊరుకోదు కదా. అందుకే బ్రహ్మాండమైన ఐడియా వేశారు. అందరూ కూడా పార్టీ అధినేతలకు రాజీనామా లేఖలు ఇవ్వడం మొదలెట్టారు. అదేంటంటే పదవి వచ్చింది అధినేత వళ్ళే కాబట్టి అధినేతకే రాజీనామా లేఖ ఇస్తున్నామని తమ రాజనీతి గురించి గొప్పగా చెప్పుకున్నారు. తెలంగాణా ఇవ్వాలని నిర్ణయించుకున్న సోనియా గాంధీ చేతికే సీమాంధ్ర ఎంపిలు రాజీనామా లేఖలు ఇచ్చి గొప్ప డ్రామా నడిపారు. ప్రజలు ఎంత నవ్వుకున్నా ఇలాంటి డ్రామాల విషయంలో మన నాయకులకు అస్సలు సిగ్గు ఉండదు.
ఇక ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని సస్పెండ్ చేయడం కూడా అలానే ఉంది. వాకాటిని తెదేపా నుంచి సస్పెండ్ చేశామని చంద్రబాబు ఘనంగా ప్రకటించారు. అవినీతిపారులు, తప్పులు చేసేవాళ్ళకు పార్టీలో స్థానం లేదన్నారు. బాగుంది సంబడం. అసలు వాకాటికి టిడిపిపైన అభిమానం ఉందా? పార్టీలో ఉంటే ఎంత? లేకుంటే ఎంత? ఆయనకు కావాల్సింది ఎమ్మెల్సీ పదవి. అందుకే పార్టీకి, ఓటర్లకు కూడా లెక్క తక్కువ కాకుండా డబ్బులు పంచి పదవి దక్కించుకున్నాడు అన్నది వాస్తవం. అలాంటి వాకాటిని ఎమ్మెల్సీగా రాజీనామా చేయమని చంద్రబాబు అడిగి ఉంటే, రాజీనామా చేయించి ఉంటే నిజంగా చంద్రబాబును అభినందించాల్సిందే. కానీ ఆయనగారు మాత్రం వాకాటికి అస్సలు నష్టం లేకుండా కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇఫ్పుడు తాజాగా వాకాటి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. కేసుల నుంచి బయటపడడానికి తన ఎమ్మెల్సీ అధికారాన్ని కచ్చితంగా వాడుకుంటాడనడంలో సందేహం లేదు. ప్రతిపక్ష నాయకుడి పదవి లేకపోతే విజయ్ మాల్యాకు జగన్‌కి తేడా లేదని టిడిపి నాయకులే చెప్తున్నారు. ఇప్పుడు వాకాటికి కూడా అదే సూత్రం వర్తిస్తుందిగా. 2019 ఎన్నికల సమయం వరకూ వాకాటి సస్పెన్షన్ డ్రామా నడిపిస్తారు. ఆయనపైన ఉన్న కేసులు ముందుకు నడవకుండా ఎలా చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు కాబట్టి, పై వాళ్ళ సహాయ సహకారాలు కూడా గట్టిగానే ఉంటాయి కాబట్టి చట్టం ఆయనకు పోయేదేమీ లేదు. 2019లో మాత్రం టిడిపి తప్పకుండా గెలుస్తుంది అనుకుంటే సస్పెన్షన్ తీసేయించుకుని పార్టీకి భారీ ఎన్నికల ఫండ్ ఇచ్చి మరీ టిడిపికి సాయం చేస్తాడు. అలా కాదు జగన్ గెలుస్తాడనుకుంటే ….టిడిపి సస్పెన్షన్ చేసింది అని చెప్పి జగన్ పంచన చేరి జగన్ గెలుపుకు దోహదపడతాడు. ఇక ఇప్పుడు వాకాటి టిడిపి నుంచి సస్పెన్షన్ అని చంద్రబాబు అనడం, తాటికాయంత అక్షరాలతో ఆ వార్తలు భజన మీడియాలో రావడం, అవినీతిపై చంద్రబాబు ఉక్కుపాదం అన్న విశ్లేషణలు అన్నీ కూడా ప్రజలను అమాయకులను చేస్తూ ఆడుతున్న డ్రామా కాకపోతే ఇంకేమవుతుంది?