పింక్ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది హిందీ సినిమానే అయినా, తెలుగు వాళ్లందరికీ ఈ కథ గురించి బాగా తెలుసు. `ఓ అమ్మాయి నో అంటే నోనే..` అనే పాయింట్‌తో నడిచే కథ ఇది. ఓ అమ్మాయి నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన, మద్యం సేవించినంత మాత్రాన, అబ్బాయితో చనువుగా మాట్లాడినంత మాత్రాన… సెక్స్ కి ఇన్విటేషన్ పంపినట్టు కాదని, తాను వేశ్య అయినా, భార్య అయినా… తనకు ఇష్టం లేకుండా శృంగారం జరపడం నేరమని – కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన సినిమా. ఈ కథ ఇప్పుడు తెలుగులో `వకీల్ సాబ్` గా రూపొందుతోంది.
పవన్ కథానాయకుడు అనేసరికి…. కథ, కథనం, దాన్ని చూపించే విధానం మారుతుందని భావించడం సహజం. పవన్ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు అభిమానులు ఎంత సంబరపడ్డారో, నాన్ ఫ్యాన్స్ – అంత గొడవ చేశారు. అమ్మాయిల కథ అయ్యిండి, అమ్మాయిల ఫొటో లేకుండా పోస్టర్ని డిజైన్ చేశారంటూ మండి పడ్డారు. అక్కడ పింక్ రీమేక్‌లో అమితాబ్ బచ్చన్ పోస్టర్ని చూపిస్తూ… గోల చేశారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి తొలి పాట వచ్చింది. అది కేవలం అమ్మాయిల గురించి, వాళ్ల వ్యక్తిత్వం గురించీ, వాళ్ల గొప్పదనం త్యాగాల గురించి స్తుతించిన గీతం. ఈరోజు… అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, సందర్భానికి తగినట్టుగా ఈ పాటని రూపొందించి, విడుదల చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఆడవాళ్లకు ఇది నిజమైన నివాళి.
పవన్ సినిమా కాబట్టి – పవన్ ఫ్యాన్స్‌కి నచ్చేలా, ఓ మాస్ గీతాన్ని డిజైన్ చేసే అవకాశం ఉంది. దాన్నే తొలిపాటగా విడుదల చేసి ఫ్యాన్స్‌ని ఖుషీ చేయొచ్చు. కానీ చిత్రబృందం అలాంటి ఆలోచన దరి చేరనివ్వలేదు. పాటలో ఎక్కడా పవన్ ఫొటో వాడలేదు. మహిళల క్యారికేచర్స్ని మాత్రమే చూపించారు. లతా మంగేష్కర్ నుంచి మిథాలీ రాజ్ వరకూ ఈ దేశానికి ఎనలేని సేవలు చేస్తున్న మహిళామణుల చిత్రాల్ని చూపిస్తూ – వాళ్లని ఘనంగా కీర్తించారు.
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు తెలుసా…. అంటూ మొదలైన ఈ గీతంలోని ప్రతీ పదంలోనూ… స్త్రీ వ్యక్తిత్వాన్ని, ధీరత్వాన్ని అద్దం పట్టారు.
నీ కాటుక కనులు విప్పారకపోతే…
ఈ భూమికి తెలవారదుగా..
నీ గాజుల చేయి కదలాడకపోతే
ఏ మనుగడ కొనసాగదుగా.. అంటూ స్తీతత్వాన్ని అద్భుతంగా పలికించారు రామజోగయ్య శాస్త్రి.
ఆలయాలు కోరని ఆదిశక్తి – నీ లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి మగవాడూ పసివాడే – అనడం బాగుంది.
స్త్రీ ఔనత్యాన్ని చెబుతూ చాలా పాటలొచ్చినా వాటిలో కొన్ని పాటలు మాత్రమే జనం మళ్లీ మళ్లీ పాడుకునేలా, వినేలా సాగాయి. ఆ జాబితాలో ఈ పాట కచ్చితంగా చోటు సంపాదించుకుంటుంది.