రేటింగ్: 3
కొన్ని కథల్లోనే హీరోయిజం ఉంటుంది. కొన్ని కథలకు హీరో కావాలి. బలమైన కథకు స్టార్ తోడైతే – ఆ స్థాయి వేరుగా ఉంటుంది. `పింక్`లో జరిగింది అదే. ఓ ముగ్గురు అమ్మాయి కథ అది. వాళ్లని గెలిపించడానికి అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ వచ్చాడు. అక్కడ ఆ కథ వర్కవుట్ అయ్యింది. తమిళంలో అజిత్ తో తీస్తే.. అక్కడా ఆడేసింది. అయితే.. తెలుగులో పవన్ కల్యాణ్‌కి ఉన్న ఇమేజ్ వేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. మరి తెలుగులో పింక్ కథ వర్కవుట్ అయ్యిందా, లేదా? పవన్ కల్యాణ్ ని తెరపై చూసుకుని పండగ చేసుకోవాలనుకున్న పవన్ అభిమానులు ఆశల్ని వకీల్ సాబ్ ఎంత వరకూ మోశాడు?
కథ
పింక్ చూసిన వాళ్లకు ఇది తెలిసిన కథే. కానీ మరోసారి చెప్పుకుంటే… ముగ్గురు అమ్మాయిలు. అనుకోకుండా.. ఓ రిసార్ట్ లో అపరిచితమైన వ్యక్తులతో కొంతసేపు గడపాల్సివస్తుంది. ఆ సమయంలో పల్లవి (నివేదా థామస్) ఎంపీ కొడుకుపై దాడి చేస్తుంది. పల్లవిపై మిగిలిన ఇద్దరు స్నేహితులపై హత్యాయత్నం కేసు నమోదు అవుతుంది. పోలీసులు అరెస్టు చేస్తారు. ఈ ముగ్గురూ.. ఎంపీ కొడుకుని బ్లాక్ మెయిల్ చేయాలని చూశారని, డబ్బులు గుంజారని ఎఫ్.ఐ.ఆర్ నమోదు అవుతుంది. అప్పటి వరకూ సరదాగా సాగిపోయిన ముగ్గురు అమ్మాయిల జీవితం ఒక్క రోజు, ఒక్క రాత్రిలో తారుమారు అవుతుంది. సాక్ష్యాలన్నీ ఈ ముగ్గురు అమ్మాయిలకూ వ్యతిరేకంగా ఉంటాయి. వాదించడానికి ఒక్క లాయర్ కూడా ముందుకు రాడు. అదే కాలనీలోకి కొత్తగా వచ్చిన సత్యదేవ్ (పవన్ కల్యాణ్) ఓ లాయర్. కానీ… బాన్ లో ఉంటాడు. బాన్ గడువు తీరిపోయినా కోర్టుకు వెళ్లడు. కానీ ఈ ముగ్గురు అమ్మాయిల కేసు వాదించడానికి ఒప్పుకుంటాడు. మరి ఆ కేసులో సత్యదేవ్ ఎలా గెలిచాడు? ఆ ముగ్గుర్నీ ఎలా గెలిపించాడు? సత్యదేవ్ గతమేంటి? అనేదే కథ.
విశ్లేషణ
పింక్ ని తెలుగు లో చేస్తున్నారు, అందులోనూ పవన్ కల్యాణ్ తో అనగానే అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పవన్ కి సూటయ్యే సబ్జెక్ట్ కాదిది. ఇందులో హీరోయిజం ఉండదు. ఎలివేషన్స్ ఉండవు, పాటలుండవు. కానీ.. ఇవన్నీ పవన్ కోసం జోడిస్తారని మాత్రం తెలుసు. ఇక్కడే `పింక్`పై అనుమానాలు మొదలైపోతాయి. ఆ కథని డైవర్ట్ చేస్తారేమో అనే భయాలు వచ్చేస్తాయి. కథని చెడగొట్టకుండా, పవన్ అభిమానులకు కావల్సింది ఇవ్వకుండా ఈ సినిమా తీయడం చాలా కష్టమైన పని అనే సంగతి ముందే తెలిసిపోతోంది. అయితే… ఈ కష్టాన్ని – దర్శకుడు దాటేశాడు.
సినిమా మొదలెట్టగానే… నేరుగా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. `మగువ..` పాటలోనే ముగ్గురు అమ్మాయిల్నీ పరిచయం చేసి, వాళ్ల జీవితాల్ని తెరపై చూపించి ఆ పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేశాడు. రిసార్ట్ గొడవ చూపించకుండా దేచేసి (పింక్‌లో ఉన్నదే) అక్కడ ఏం జరిగి ఉంటుందన్న ఆసక్తిని రేకెత్తించాడు. పవన్ ఎంట్రీ… అభిమానులకు నచ్చుతుంది. మధ్యమధ్యలో మాస్ ఎలివేషన్లు… డైలాగులు పవన్ అభిమానుల్ని సంతృప్తిపరిచేలా సాగాయి. ఇంట్రవెల్ ఎపిసోడ్ కూడా… పవన్ ఫ్యాన్స్ కోసం డిజైన్ చేసిందన్న సంగతి అర్థమైపోతుంది. ఫస్టాఫ్ లో కాస్త విసుగు అనిపించేది.. పవన్ ఫ్లాష్ బ్యాకే. ఈ ఎపిసోడ్ కొత్తగా ఉండాల్సింది. స్టూడెంట్ రాజకీయాలు, సత్యదేవ్ `లా` చదవడం, శ్రుతిహాసన్ తో ప్రేమాయాణం.. ఇవన్నీ ఈ ఫ్లాష్ బ్యాక్‌లోనే సాగాయి. అదంతా ఫోర్డ్స్ డ్రామా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ ని కాస్త బాగా రాసుకుంటే…. ఫస్టాఫ్ కూడా ఓ హై ఇచ్చి ఉండేది.
ద్వితీయార్థం మొత్తం కోర్టు డ్రామానే. పింక్ బలం ఇదే. పింక్‌లో ఏమైతే సీన్లు బలంగా పండాయని దర్శకుడు భావించాడో.. వాటి జోలికి వెళ్లకుండా, వీలైనంత వరకూ ఇంకాస్త ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఉదాహరణకు సూపర్ ఉమెన్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ లో… పవన్ తన బాడీ లాంగ్వేజ్‌తోనూ, డైలాగుల్లో ఉన్న వెటకారం తోనూ ఇంకాస్త పండించాడు. `మీరు నేషనల్ అవార్డు స్థాయిలో నటిస్తున్నారు. ఆ పెర్ఫార్మెన్స్ చూళ్లేకపోతున్నాం` అన్న చోటా… చప్పట్లు పడతాయి. అడవిలో రెండు సింహాలు తలపడితే ఎలా ఉంటుందో కోర్టులో పవన్ – ప్రకాష్ రాజ్ వాదించుకుంటే అలా ఉంటుంది. అవన్నీ జోష్ పెంచే సన్నివేశాలే. కాకపోతే… వాదనలు తక్కువ, అరుపులు ఎక్కువ అయిపోయాయి. ఆ బోర్డర్ .. దర్శకుడు క్రాస్ చేశాడు. అమ్మాయిల సహజ గుణాల్ని – అబ్బాయిలు అర్థం చేసుకోవడంలో ఉన్న లోపాల్ని కొన్ని డైలాగుల్లో చెప్పే ప్రయత్నం చేశారు. అవన్నీ మహిళా ప్రేక్షకుల మన్ననల్ని పొందేవే. క్లైమాక్స్‌లో ఓ ఫైటు ఉండాలి కాబట్టి, మెట్రో ఫైట్ ని జోడించారు. రిసార్ట్ లో ఏం జరిగిందన్న విషయాన్ని క్లైమాక్స్ లో సవివరంగా చెప్పి – ప్రేక్షకుడ్ని ఇళ్లకు పంపించారు.
నటీనటులు
పవన్ ని చాలా రోజుల తరవాత వెండి తెరపై చూడడం.. అభిమానులకు పండగలాంటి విషయం. కోర్టు సన్నివేశాల్లో పవన్, ప్రకాష్ రాజ్ ల మధ్య పోటా పోటీ నటన సాగింది. గెడ్డం ఉన్నప్పుడు, లేనప్పుడు కంటే.. కోర్టు సన్నివేశాల్లోనే పవన్ లుక్ బాగుంది. ఫ్లాష్ బ్యాక్‌లో పవన్ కాస్ట్యూమ్స్ బాగున్నా, మేకప్ విషయంలో శ్రద్ధ పెట్టలేదు. చాలా సందర్భాల్లో పవన్ కదలడానికి సైతం ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది. అయితే సుదీర్ఘమైన విరామం వచ్చినప్పుడు ఇలాంటివి తప్పవేమో. మొత్తానికి పవన్‌ని అభిమానులకు నచ్చేలా తెరపైకి తీసుకొచ్చారు. శ్రుతిహాసన్ ఇలా వచ్చి, అలా వెళ్లిపోతుంది. తను ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదు. ముగ్గురు అమ్మాయిల్లో నివేదాకే ఎక్కువ మార్కులు. అలాగని అంజలి, అనన్యలను తక్కువ చేయలేం.
సాంకేతిక వర్గం
పవన్ పై ప్రేమని తమన్ ప్రతీ సీన్ లోనూ చూపించే ప్రయత్నం చేశాడు. తన ఎలివేషన్లతో.. ఆకట్టుకున్నాడు. తమన్ ఇచ్చిన బీజియమ్స్ బాగున్నాయి. మగువ – మగువ పిక్చరైజేషన్ పరంగానూ ఆకట్టుకుంటుంది. ఫొటోగ్రఫీ నీట్ గా ఉంది. సంభాషణలు, ముఖ్యంగా కోర్టు రూమ్ లో రాసుకున్న మాటలు బాగున్నాయి. మధ్యమధ్యలో జనసేనకు రిలేట్ అయ్యే డైలాగులు పడ్డాయి. ఇలాంటి కథని ఓ స్టార్ హీరోతో డీల్ చేయడం కత్తి మీద సామే. దాన్ని చాకచక్యంగా నిర్వర్తించాడు వేణు శ్రీరామ్.
మొత్తానికి వకీల్ సాబ్.. ఫ్యాన్స్ కి నచ్చుతాడు. ద్వితీయార్థంలో ఎమోషన్లు పండాయి. కొన్ని ఎలివేషన్లు కుదిరాయి. పింక్ కి మించిపోయే సినిమా కాదు గానీ, ఆ ఎఫెక్ట్ ని చెడగొట్టకుండా తీశారు. ఆ విషయంలో చిత్రబృందాన్ని అభినందించాలి.
ఫినిషింగ్ టచ్: వసూల్ సాబ్
రేటింగ్: 3