స్టార్ హీరోతో సినిమా అంటే… మాటలు కాదు. చాలా విషయాలు ఆలోచించాలి. తన ఇమేజ్‌కి కథ తగ్గట్టుగా ఉందా, లేదా చూసుకోవాలి. కథలో ఎంత దమ్మున్నా – అది హీరోని డామినేట్ చేయకూడదు. అస్తమానూ కథే చెబుతామన్నా కుదరదు. హీరోయిజం చూపించాలి. కమర్షియల్ హంగులు ఉండాలి. అందుకోసం కథని దాటి ఆలోచిస్తుండాలి. వకీల్ సాబ్ కోసం అదే చేస్తున్నారిప్పుడు. బాలీవుడ్ లో విమర్శల ప్రశంసలు అందుకుని, ఓ విభిన్నమైన చిత్రంగా నిలిచింది `పింక్`. దాన్ని తెలుగులో `వకీల్ సాబ్`గా రీమేక్ చేస్తున్నారు. పవన్ ఇమేజ్ వేరు. అమితాబ్ స్థాయి వేరు. రెండింటినీ పోల్చలేం. అమితాబ్ చేసిన పాత్ర, ఆయన చేసినట్టుగానే పవన్‌తో చేయిస్తే – ఫ్యాన్స్‌కి ఎలాంటి కిక్కూ ఉండదు. అందుకోసం ఎన్నో గారడీలు చేయించాల్సివస్తుంటుంది.
పింక్ ని వకీల్ సాబ్ గా మారుస్తున్నప్పుడు ఇలాంటి జిమ్మిక్కులే చేస్తున్నారు. మాతృకలో లేని హీరోయిన్ ని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. ఫైట్లు జోడించారు. ఇప్పుడు ఓ ప్రత్యేక గీతం కూడా ఇరికిస్తున్నార్ట. అలాగని అదేదో.. ఐటెమ్ గీతంలా హాట్ గా ఉండదు. హీరోయిజం మిక్స్ చేసిన పాట అది. మరోవైపు `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్ లోనూ ఇంతే. పవన్ కోసం చాలా కీలకమైన మార్పులు చేస్తున్నారు. త్రివిక్రమ్ స్టైల్ లో కొంత కామెడీని మిక్స్ చేసి, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని క్రియేట్ చేసి.. పవన్ పాత్రకు మరింత వెయిట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశార్ట. పవన్‌పై త్రివిక్రమ్ కి ప్రత్యేకమైన అభిమానం. అదంతా.. తన రాతలో చూపించాలన్న కసి.. త్రివిక్రమ్ లో కనిపిస్తోందని, అందుకే పవన్ కోసం రాసిన సీన్లే.. తిరగరాస్తూ – పాత్ర ని మరింత ఎలివేట్ చేస్తున్నాడని సమాచారం. మొత్తానికి రెండు రీమేక్‌లలోనూ. పవన్ పాత్రల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ అభిమానులకు కిక్ ఇచ్చే విషయాలే. కాకపోతే… అసలు కథలేమవుతాయో అన్నది చిన్న డౌటు.