దర్శకులకు స్వేచ్ఛ ఇవ్వరని మెగా కాంపౌండ్ మీద ఒక విమర్శ. ఇటు రామ్‌చరణ్‌తో సినిమా చేస్తే చిరంజీవి, అటు అల్లు అర్జున్‌తో సినిమా చేస్తే అరవింద్ ప్రతి విషయంలోనూ అడుగడుగునా దర్శకుడు వెనకుండి సినిమా బండి నడిపిస్తారని టాక్. ముఖ్యంగా గీతా ఆర్ట్స్‌లో అల్లు అరవింద్ సూచించే మార్పులు చేర్పులు చేసి సిన్మాను బయటకు తీసుకురావడం అంత వీజీ కాదంటారు. కాని తమకు నచ్చిన దర్శకులు దొరికితే మెగా కాంపౌండ్ అంత తేలిగ్గా వదులుకోవడం లేదు. వెంటనే రెండో సినిమాకు సంతకం చేయించుకుంటున్నారు. పైన వచ్చే విమర్శలు పక్కన పెడితే దర్శకులు కూడా మెగా హీరోలతో, మెగా నిర్మాణ సంస్థలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
‘సరైనోడు’ తరవాత చిరంజీవి హీరోగా సినిమా చేసేలా ఆ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఒప్పందం చేసుకున్నారు. చిరు ఇతర సినిమాల వల్ల ఆలస్యమైంది. ‘ధృవ’ తరవాత చిరంజీవి హీరోగా ‘సైరా’ చేస్తున్నాడు సురేందర్ రెడ్డి. ఇప్పుడు వక్కంతం వంశీ వంతు వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’తో దర్శకుడిగా పరిచయమవుతున్నాడీ రచయిత. ఈ సినిమాను నిర్మాత లగడపాటి శ్రీధర్ అయినప్పటికీ కర్త, కర్మ, క్రియ అన్నీ తానై నడిపించాడు బన్నీ. మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, ముఖ్యంగా ‘బన్నీ’ వాసు సినిమా వ్యవహారాలు చూసుకున్నారు. సినిమా నిర్మాణంలో గీతా ఆర్ట్స్ హ్యాండ్ వుంది. అదే గీతా ఆర్ట్స్‌లో వక్కంతం వంశీ నెక్స్ట్ సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో “ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక వంశీతో అతని రెండో సినిమా కూడా మేమే నిర్మిస్తామని చెప్పాం” అని ‘బన్నీ’ వాసు వ్యాఖ్యానించారు. సో… దర్శకుడి నుంచి ముందుగా మాట తీసుకున్నారు అన్నమాట. నెక్స్ట్ సినిమా కూడా అల్లు అర్జున్ చేస్తాడా? రామ్ చరణ్, మిగతా హీరోలలో ఎవరితో అయినా చేస్తారో?