పదార్థవాదం పెరిగిన ప్రపంచంలో ప్రతిదీ వ్యాపార వస్తువే. ఒక విషయాన్ని కనీసం ఏడాదికి ఒకసారైనా గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో రకరకాల డేస్, దినోత్సవాలను ప్రకటించారు. ఎయిడ్స్ డే, క్యాన్సర్ డే, యోగా డే వగైరా. ఆ అంశాలను, వాటి పర్యవసానాలను గుర్తు చేసుకోవడం, పాజిటివ్ ఫలితాలను పొందడానికి ప్రయత్నించడం వాటి ఉద్దేశం. కానీ వ్యాపారులు మాత్రం ప్రతిదాన్నీ వ్యాపారంగా మార్చేశారు. ప్రేమను కూడా సెల్లింగ్ ప్రాడక్ట్ గా చేసి పారేశారు.
ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే. అసలు వాలంటైన్ అంటే ఏమిటో తెలియకుండా పార్కుల్లో, రోడ్ల మీద హల్ చల్ చేసే వాళ్లే ఎక్కువ. వ్యాపారికి లాభం ముఖ్యం. మరేదీ పట్టించుకోడు. వాలంటైన్స్ డే గిఫ్టుల పేరుమీద దేశంలో వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఎంత ఖరీదైన గిఫ్ట్ ఇస్తే అంత గొప్ప.
ప్రతి ఏడాదీ వాలంటైన్స్ డేను న్యూసెన్స్ గా మార్చే వాళ్లు తయారవుతున్నారు. పార్కుల్లో వాటేసుకుని, రోడ్ల మీద ముద్దులు పెట్టుకోవడమే ప్రేమా? ఎవరికి వారు ఇంట్లోనో, మరో ప్రయివేట్ ప్లేస్ లోనో ప్రేమను వ్యక్తం చేసుకోకూడదా? ఒకరి ప్రేమను మరొకరు చూసేలా ఎందుకు వ్యక్తం చేయాలి? అసలు ప్రేమంటే ఏమిటి? సెయింట్ వాలంటైన్ ఏం చేశాడు, ఏం చెప్పాడనేది ఈ రోడ్లమీద హడావుడి చేసేవారిలో ఎందరికి తెలుసు?
భార్యకు క్యాన్సర్ వస్తే కంటికి రెప్పలా కాపాడుకుని, ఎంత ఖర్చయినా, కష్టమైనా ఎదురీది బతికించుకున్నాడు ఒక భర్త. అదీ ప్రేమ. భర్తకు పక్షవాతం వస్తే అతడు తిరిగి కోలుకుకునే వరకూ పసిబిడ్డలా ఆలనా పాలనా చూసుకుంది ఒక భార్య. అదీ ప్రేమ. హృదయాన్ని తాకే ఇలాంటి ప్రేమ గాథలు మన దేశంలో కో కొల్లలుగా కనిపిస్తాయి. ఇక్కడ ఖరీదైన గిఫ్టులుండవు. నేనున్నాననే సందేశం ఉంటుంది. రోడ్ల మీద తైతక్కలుండవు. కంటికి రెప్పలా కాపాడటమే ఉంటుంది. నిజమైన ప్రేమను వదిలి రోడ్డెక్కడం, ఏదైనా సంస్థ వాళ్లు అడ్డుకుంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిందని గొంతు చించుకోవడం పరిపాటిగా మారింది.
పబ్లిక్ ప్లేస్ లో వాటేసుకుంటేనే అది ప్రేమ అని సెయింట్ వాలంటైన్ చెప్పాడా? ప్రతి ఏడాదీ ఎందుకీ న్యూసెన్స్? ప్రేమికులమంటూ బహిరంగ ప్రదేశాల్లో కొందరు అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్లకు పెళ్లి చేస్తామంటూ కొన్ని సంస్థల వాళ్లు వెంట పడటం, షరా మామూలే. ప్రేమ అనేది మనసుకు సంబంధించిన విషయం. ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. వాళ్లను రోడ్డుమీద పోయే వాళ్లు చూడాల్సిన అవసరం లేదు. పార్కుకు వచ్చిన వేరే వాళ్లు, పిల్లలు ఇబ్బంది పడేలా వాటేసుకుని వెకిలి చేష్టలు చేయాల్సిన అవసరం లేదు. వ్యాపారుల మాయాజాలంలో పడిన యువతీ యువకులు కోరి కష్టాలను కొనితెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంతా చేసి, వీళ్లు నిజంగా రేపు పెళ్లి చేసుకుంటారా అంటే అదీ గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఎందుకు?