Valimai telugu review
రేటింగ్: 2/5
సూపర్ స్టార్లతో సినిమాలు తీసే అవకాశం ఈతరం దర్శకులకు చాలా తొందరగా దొరికేస్తోంది. ఒకట్రెండు హిట్లు ఉంటే చాలు. స్టార్లు పిలిచి మరీ ఛాన్సులు ఇస్తున్నారు. తమిళంలో అజిత్ చాలా పెద్ద స్టార్. తనతో సినిమా తీసే అవకాశం రావడం అంటే మామూలు మాటలు కాదు. వినోద్‌కి ఈ గోల్డెన్ ఛాన్స్ రెండోసారి వచ్చింది. `ఖాకి`లాంటి సూపర్ డూపర్ హిట్టుతో అందరి దృష్టినీ ఆకర్షించాడు వినోద్. బాలీవుడ్ `పింక్`ని తమిళంలో అజిత్ తో రీమేక్ చేసింది తనే. అందుకే అజిత్ మరో ఛాన్స్ ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి ఈసారి యాక్షన్ ప్యాకేజీతో ముందుకొచ్చారు. అదే… `వలిమై`.
విశాఖ తీరంలో ఈ కథ మొదలైంది. అక్కడ ఓ ముఠా హత్యలు, చైన్ స్నాచింగ్స్ తో హడలెత్తిస్తుంటోంది. రోజూ ఏదో ఓ ఘోరం. దాంతో.. ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతుంది. జరుగుతున్న అరాచకాల్ని ఆపి, ప్రజల్లో ధైర్యం నింపడానికి ఏసీపీ అర్జున్ (అజిత్) రంగంలోకి దిగుతాడు. ఈ ముఠా వెనుక ప్రధాన సూత్రధారి, పాత్రధారి… నరేన్ (కార్తికేయ) అనే విషయం తెలుసుకుంటాడు. నరేన్ ని పట్టుకోవడానికి అర్జున్ ఏం చేశాడు? ఆ ప్రయత్నంలో తన జీవితాన్ని ఎలా పణంగా పెట్టాడన్నదే కథ.
`వలిమై` యాక్షన్ థ్రిల్లర్. ఆ మాటకొస్తే యాక్షన్ తప్పిస్తే, ఈ సినిమాలో ఏం కనిపించదు. యాక్షన్‌ని పక్కన పెట్టి చూస్తే, ఈ కథని అజిత్ ఎలా ఒప్పుకున్నాడా? అనిపిస్తుంది. ఓ సాధారణ కథ ఇది. కానీ… దాన్ని అసాధారణ యాక్షన్ సన్నివేశాలతో నింపి మ్యాజిక్ చేశాడు దర్శకుడు. బైక్ రేసింగ్ ముఠా అనే నేపథ్యం ఎంచుకోవడమే ఈ సినిమాకి ప్లస్. ఎందుకంటే ఇలాంటి బ్యాక్ డ్రాప్లో ఇంత వరకూ సినిమా రాలేదు. దాంతో ఆయా యాక్షన్ సీన్లన్నీ కొత్తగా అనిపిస్తాయి. ఈ సినిమాలో నాలుగైదు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. అవన్నీ రెగ్యులర్ గా ఉండవు. బైక్ ఛేస్, బస్ ఛేజ్.. ఇలా వేర్వేరుగా ప్లాన్ చేశారు. ముఖ్యంగా ద్వితీయార్థం ప్రారంభంలో వచ్చే బస్ ఛేజ్… ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్. చూస్తోంది దక్షిణాది సినిమానా, లేదంటే హాలీవుడ్ సినిమానా? అన్నంత ఆశ్చర్యాన్ని కలగచేస్తాయి ఆ ఫీట్లు. అదేదో ఛేజ్ లా కాకుండా ఫజిల్లా తీశాడు దర్శకుడు. వీడియో గేమ్ లో… లెవల్స్ పెరిగే కొద్దీ, టాస్క్‌లు పెరిగినట్టు, ఆ ఛేజ్ సాగే కొద్ది, కొత్త థ్రిల్ యాడ్ అవుతూ ఉంటుంది. ఆ యాక్షన్ ఛేజ్ డిజైన్ చేసిన కొరియో గ్రాఫర్నీ, దాన్ని అంత పకడ్బందీగా తెరకెక్కించిన కెమెరామెన్నీ మెచ్చుకోకుండా ఉండలేం. ఇంట్రవెల్ ముందు కూడా మంచి సీక్వెన్స్ ప్లాన్ చేశారు. అయితే లెంగ్త్ ఎక్కువై, ఆ యాక్షన్ ఎపిసోడ్ బోర్ కొడుతుంది. సినిమా పూర్తయి, బయటకు వచ్చిన తరవాత, బైక్ సౌండ్లూ, ఆ ఛేజింగులూ తప్ప, కథ.. కాకరకాయ్ ఇలా ఏదీ గుర్తుండదు.
ఫస్టాఫ్ కాస్త రేసీగానే సాగుతుంది. సెకండాఫ్‌కి మంచి లీడ్ ఇచ్చాడు. ఇంట్రవెల్ పూర్తవ్వగానే బస్ ఛేజ్ మొదలవుతుంది. అంత వరకూ బాగానే ఉంది సినిమా. కానీ.. తమిళ ప్రేక్షకుల కోసమనో, కథలో ఏం చెప్పకపోతే బాగోదనో, మదర్ సెంటిమెంట్ ని ఇరికించాడు దర్శకుడు. అది నిజంగా బలవంతంగా తెచ్చి అతికినట్టే ఉంటుంది. కథ ఫ్లోని, అప్పటి వరకూ వచ్చిన ఫీల్ ని ఆ సెంటిమెంట్ సీన్లు పూర్తిగా చంపేస్తాయి. పైగా ఆ తరవాత అంతా రొటీన్ రొడ్డ కొట్టుడే. పెద్దగా ట్విస్టులూ, టర్న్‌లూ ఉండవు. కేవలం దొంగ – పోలీస్ ఆట. అంతే.
అజిత్ పాత్రకి ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. ఆ పాత్ర కోసం దర్శకుడు కొంచెం స్టడీ చేశాడు. బాగా డిజైన్ చేశాడు. కానీ ఆ శ్రద్ధ మిగిలిన పాత్రలపై పెట్టలేదు. ఈ కథలో అత్యంత కీలకమైన నరేన్ (కార్తికేయ) పాత్రనీ తూ.తూ మంత్రంగా నడిపించేశాడు. యాక్షన్ సీన్లకు ముందు ఉండాల్సిన ఎమోషన్ అస్సలు వర్కవుట్ కాలేదు. సినిమా నిడివి కూడా ఇబ్బంది పెట్టే విషయమే. ఈ సినిమాపై హాలీవుడ్ స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తోంది. యాక్షన్ సీన్లు అలానే తీశారు. దానికి పెద్ద పీట వేసినప్పుడు, అనవసరమైన డ్రామానీ, సెంటిమెంట్ నీ ఇరికించకుండా ఉండాల్సింది. అంతర్జాతీయ స్థాయిలో ఆలోచిస్తున్నామంటూ.. ముతక ఫార్ములాకు మళ్లీ కట్టుబడిపోయారు. ఈ సినిమాని షార్ప్ గా ఎడిట్ చేసి, రెండు గంటలకు పరిమితం చేసి, సెంటిమెంట్ సీన్లనీ లేపేసి ఉన్నట్లైతే, కచ్చితంగా ఇండియన్ స్క్రీన్ పై మంచి యాక్షన్ సినిమా మిగిలిపోయేది.
అజిత్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. తను స్వతహాగా రేసర్. తన అభిరుచిని చాటుకోవడానికి ఈ పాత్ర ఓ అవకాశం ఇచ్చింది. అయితే అజిత్ మరీ లావుగా కనిపిస్తున్నాడు. తెరపై కదలడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. యాక్షన్ సీన్లన్నీ డూప్‌తో లాగించేసినవని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కార్తికేయ మరోసారి విలన్ గా కనిపించాడు. అజిత్ తో కలసి నటించడం, ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాలో అవకాశం రావడం గొప్ప విషయాలు. అది మినహాయిస్తే.. తనని కొత్తగా నిరూపించే సీన్లు ఏం లేవు. తన పాత్రని దర్శకుడు లైట్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. హ్యూమ ఖురేషీ పాత్రని బాగానే పరిచయం చేసినా, చివరికి ఆ పాత్ర కూడా సరిగా డిజైన్ చేయకపోవడం వల్ల నీరుగారిపోయింది.
యాక్షన్ మాస్టర్లకు ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. వాళ్లు తీర్చిదిద్దిన ఫైట్స్, ఛేజింగులు… వెండి తెరకు కళ్లు అప్పగించేలా చేస్తాయి. యువన్ శంకర్ రాజా బాణీలు పెద్దగా ఆకట్టుకోవు. కానీ… యాక్షన్ సీన్స్ లో ఇచ్చిన బీజియమ్స్ మాత్రం బాగా హెల్ప్ అయ్యాయి. వినోద్ కథ, కథనం విషయంలో తడబడ్డాడు. గొప్ప యాక్షన్ సీన్లు ఉంటే ప్రయోజనం ఉండదు. వాటి మధ్య మంచి కథ ఉండాలి. ఆసక్తికరమైన కథనం రాసుకోగలగాలి. అవి రెండూ వలిమైలో కనిపించవు. ఓ ఆర్డనరీ కథలో ఎక్స్ట్రాక్డనరీ యాక్షన్ సీన్లు మిళితమైన ఫీలింగ్ కలుగుతుంది.
ఫినిషింగ్ టచ్: దొంగా పోలీస్ ఆట
రేటింగ్: 2/5