వల్లభనేని వంశీ వైసీపీలో చేరికతో.. జూనియర్ ఎన్టీఆర్కు మరిన్ని ఇబ్బందులు ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితులుగా పేరు పడిన వారు కొడాలి నాని, వల్లభనేని వంశీ. వీరిలో కొడాలి నాని ఎప్పుడో టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆ సమయంలో… జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహం కూడా ఉందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం లాంఛనమేనన్న చర్చ జరుగుతోంది. 2012లో ఓ సందర్భంలో జగన్ ఎదురుపడినప్పుడు.. ఆప్యాయంగా… వెలిగిపోయే ముఖంతో.. ఆలింగనం చేసుకున్నప్పుడే.. వంశీ.. అటు వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. అప్పటికే ఆప్తమిత్రుడైన కొడాలి నాని వైసీపీలో చేరి చంద్రబాబును చెడామడా తిడుతున్నారు. ఈ కారణంగానే…2014లో చంద్రబాబు వంశీకి గన్నవరం టిక్కెట్ ఇవ్వడానికి తటపటాయించారు. కానీ.. పరిటాల సునీతతో ఒత్తిడి చేయించుకుని మరీ… వల్లభనేని వంశీ టిక్కెట్ తెచ్చుకున్నారు.
అప్పుడు అధికారంలోకి రావడంతో.. వంశీకి ఇబ్బందులు ఎదురు కాలేదు. నియోజకవర్గానికి అడిగిన పనులన్నీ చేయించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లోనూ గెలిచారు. హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు… ఇతర వ్యవహారాలతో… ఆయన ఎన్నికల నుంచి డ్రాప్ అవుతారని.. అప్పుడే వైసీపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ.. టీడీపీలోనే నిలబడి గెలిచారు. ఇప్పుడు.. మాత్రం.. ఒత్తిడి తట్టుకోలేక… వైసీపీలో చేరిపోవడానికి రెడీ అయ్యారు. కొడాలి నాని దీనికి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఆప్తులందరూ వైసీపీలో చేరుతూండటంతో.. టీడీపీ క్యాడర్లో ఆయనపై.. సానుకూలత ఏర్పడే అవకాశం లేదు. ఆయన గతంలో.. టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరారు. ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్కు.. భవిష్యత్లో ఇబ్బందికర పరిణామాలుగా మారే అవకాశం కనిపిస్తోంది.