గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మట్టికొట్టుకుపోయేలా చేసేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పోలవరం కాలువ గట్లను కూడా తవ్వుకుని అమ్మేసుకున్నారు. ఇందు కోసం తన వద్ద పని చేసే డ్రైవర్లు.. వైసీపీ నేతల దగ్గర పని చేసేవారిని బినామీలుగా పెట్టి లైసెన్స్లు తీసుకున్నారు. తీసుకున్న లైసెన్సులు ఓ చోట అయితే తవ్వేసింది మరో చోట. ఇలాంటి లెక్కలన్నీ విజిలెన్స్ బయటకు తీసింది. దాదాపుగా రూ. వంద కోట్ల మేర అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు.
ఎక్కడెక్కడ మట్టి తవ్వారో మొత్తం డీటైల్స్ తీసుకున్నాక.. బినామీ లైసెన్స్ దారులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వారంతా అసలు తాము వ్యాపారమే చేయడం లేదని.. జీతానికి పని చేసుకుంటున్నామని తెలిపారు. మా ఆధార్ కార్డులు జిరాక్సులు కావాలని అడిగితే ఇచ్చామని ఎందుకు అని అడిగే పరిస్థితి కూడా లేదని చెప్పుకొచ్చారు.తమ ఆధార్ కార్డులు పెట్టి వంశీ లైసెన్స్ తెచ్చుకుని తవ్వుకున్నారని వాంగ్మూలం ఇచ్చారు. ఇలా మొత్తంగా గన్నవరం నియోజకవర్గంలో జరిగిన దోపిడికి పూర్తి సాక్ష్యాలు సేకరించారు.
రేపోమాపో కేసులు పెట్టే అవకాశం ఉంది. వల్లభనేని వంశీనే మొత్తం సూత్రధారి అని స్పష్టం కావడంతో ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా రూ. వెయ్యికోట్ల వరకూ జరిమానా విధించే అవకాశం ఉన్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వల్లభనేని వంశీ అడ్రస్ లేరు. అయన అమెరికా పారిపోయినా తీసుకు వస్తామని అధికారవర్గాలు చెబుతున్నాయి.