ఎవరికైనా బెయిల్ ఇవ్వాలంటే న్యాయమూర్తి ముందుగా పెట్టే షరతు “ సాక్షుల్ని” ప్రభావితం చేయకూడదనే. అయితే వల్లభనేని వంశీ అరెస్టు అయింది ఈ సాక్షుల్ని, ఫిర్యాదుదారుల్ని కిడ్నాప్ చేశారని..బెదిరించారనే కేసులోనే. ఇక ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఎక్కడ ఉంది..? . పైగా పోలీస్ స్టేషన్ లోనే తనపై ఫిర్యాదు చేసిన వారు ఎవరు అంటూ రెచ్చిపోయారు. అవి కూడా రికార్డయ్యాయి. మొత్తంగా వంశీ.. చాలా కాలం జైల్లో ఉండాల్సిన విధంగా తన కేసును తాను క్లిష్టం చేసుకున్నారు.
14 రోజులు రిమాండ్
అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ముఖ్య నేతల్లో ఎవర్నీ పెద్దగా అరెస్టు చేయలేదు. అరాచకాలు చేసిన వారిపై కేసులు పెట్టారు కానీ వారు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అయినా ముందస్తు బెయిల్ తెచ్చుకునేందుకు అవకాశం ఇచ్చారు కానీ అరెస్టులు చేయలేదు. వంశీని కూడా అంతే. కానీ ఆయన ఇక వదిలి పెట్టకూడదన్న తప్పు చేసి దొరికిపోయారు. అయితే ఆయనకు స్టేషన్ బెయిల్ వస్తుందేమో అన్న సందేహం చాలా మందిలో ఉండేది. కానీ ఆయనపై నమోదు చేసిన సెక్షన్లను చూసిన తర్వాత రిమాండ్ గ్యారంటీనే కాదు..బెయిల్ కూడా ఇప్పుడల్లా రాదన్న వాదన వినిపిస్తోంది.
ఫిర్యాదుదారుడ్ని బెదిరిస్తే బెయిల్ ఎలా వస్తుంది?
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ వచ్చింది. ఆయన నిమ్మళంగా ఉండవచ్చు. కానీ ఆయన ఓవరాక్షన్ చేశారు. ఫిర్యాదుదారుడ్ని కిడ్నాప్ చేసి .. బెదిరించి.. దగ్గరుండి కేస్ విత్ డ్రా చేయించారు. ఇప్పుడు అరెస్టయ్యారు. ఆయనకు బెయిల్ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనే చూపించారు కాబట్టి.. ఇక ఫిర్యాదుదారులను, సాక్షులను బెదిరించవద్దు అని సూచన ఇచ్చి బెయిల్ ఇవ్వరు. అంటే సుదీర్ఘకాలం జైల్లో మగ్గాల్సిందే.
ఇంకా పలు కేసుల !
వంశీపై నమోదు చేయడానికి చాలా కేసుల రెడీగా ఉన్నాయి. టీడీపీలో ఉన్నప్పుడు కూడా మట్టి దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీలో చేరిన తర్వాత ఆయన చెలరేగిపోయాడు. వందల కోట్లు దోచుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి విజిలెన్స్ సహా అన్ని శాఖలు పూర్తి సమాచారాన్ని సేకరించాయి. కేసులు పెట్టడమే మిగిలింది.