గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పంజాబ్లోని మొహాలీలో ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే అబ్జర్వేషన్లో ఉండాలని.. చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే వల్లభనేని వంశీకి ఏమయిందనేదానిపై స్పష్టత లేదు. ఆయన ఇటీవల ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. ఐఎస్బీలో ఓ సర్టిఫికెట్ కోర్సులో చేరారు.
ఆ కోర్సు కు సంబంధించిన తరగతులు ఐఎస్బీ మొహాలీ క్యాంపస్లో జరుగుతున్నాయని.. వాటికి హాజరయ్యేందుకు వంశీ వెళ్లారని అనుచరులు చెబుతున్నారు. క్లాసులకు హాజరయ్యేందుకు వెళ్లిన సమయంలో ఓ చేయి విపరీతంగా లాగడంతో ఆయన ఆస్పత్రిలో చూపించుకున్నారు. ఓ చేయి విపరీతంగా లాగడానికి గుండెకు సంబంధించిన పనితీరుకు సంబంధం ఉండటంతో అత్యవసరంగా పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.
గుండె సంబంధితమైన సమస్యలు ఏమైనా ఉన్నాయో లేదో అని వైద్యులు చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొహాలీ ఆస్పత్రిలో చేరడంతో… వంశీకి వైద్య పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో స్పష్టత లేకుండా పోయింది. ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిన తర్వాత కొంత మంది అనుచరులు మొహాలీ వెళ్లినట్లుగా తెలుస్తోంది.