వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి దుట్టా రామచంద్రరావు కుమార్తె పోటీ చేస్తానని తాను ఆమెకు మద్దతిస్తానని చెప్పుకొచ్చారు. నామినేషన్ ర్యాలీ డిజాస్టర్ అయిన తర్వాత … ఆయన మీడియాతో మాట్లాడారు. దుట్టా రామచంద్రరావు కానీ ఆయన మద్దతుదారులు కానీ వంశీకి సపోర్ట్ చేయడం లేదు. వారి మద్దతు కోసం వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు కుమార్తెకు మద్దతిస్తానని చెబుతున్నారు.
వైసీపీలో వంశీ పరిస్థితి అత్యంత గడ్డుగా ఉంది. ఆయనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారు 90 శాతం వెనక్కి వెళ్లిపోయారు. ఓ పది శాతం మంది అనుచరులు ఆయనతో పాటు ఉన్నారు. వైసీపీలో ఉన్న యార్లగడ్డ తన అనుచరుల్ని తీసుకెళ్లిపోయారు. దుట్టా రామచంద్రరావు వర్గం… వంశీపై కసితో ఉన్నారు. టీడీపీలో ున్నప్పుడు కేసులు పెట్టించి.. వైసీపీ వచ్చిన తర్వాత కూడా తమ అవకాశాల్ని కాజేశారని వైసీపీ క్యాడర్ అసహనం. వాళ్లూ పని చేయడం లేదు. ఐదేళ్లలో నియోజకవర్గంలో చేసిందేమీ లేదు. నామినేషన్ ర్యాలీకి జనం కూడా రాలేదు. 2019లో టీడీపీ తరపున ఆయన నామినేషన్ వేస్తే జాతీయ రహదారి నాలుగైదు కిలోమీటర్ల మేర పసుపు మయం అయింది. కానీ వైసీపీ తరపున అడుగుపెడితే తీసుకొచ్చిన అడ్డాకూలీలు కూడా మధ్యలోనే వెళ్లిపోయారు.
పరిస్థితి అర్థం కావడంతో చివరికి ఆయన అసహనానికి గురవుతున్నారు. దుట్టా రామచంద్రరావును ఇంత కాలం పురుగును చూసినట్లు చూశారు. ఆయన కుమార్తెను తానే జడ్పీటీసీని చేశానని చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆయన కుమార్తెకు అవకాశం ఇచ్చి తాను తప్పుకుంటానని ఆఖరి రాగం పాడేశారు. కానీ వంశీ చేతులు కాలిపోయాయని.. ఇప్పుడు ఆకులు పట్టుకోలేరన్న సెటైర్లు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.