గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడల్లా వైసీపీలో చేరే సూచనలు కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఉపఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. ఆయన పార్టీలో చేరికను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. అదే సమయంలో.. ఒక వేళ వైసీపీలో చేరి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.. వంశీకి టిక్కెట్ ఇవ్వడం అంత.. తేలికైన విషయం కాదని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో.. ఆర్థికంగా.. విపరీతంగా ఖర్చు పెట్టుకున్న యార్లగడ్డ వెంకట్రావు.. రచ్చ చేస్తారని దాని వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందని వైసీపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. అందుకే.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా.. వంశీని టీడీపీకి దూరం చేయడం వరకే పరిమితం అవ్వాలని.. అంత కన్నా అడ్వాన్స్ అవసరం లేదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
జగన్ అలా గాల్లో ఉంచేయడంపై వల్లభనేని వంశీకి ఇప్పుడు క్లారిటీ వస్తోంది. తాను ఎమ్మెల్యేగా కొనసాగుతానని అనుచరులకు చెప్పుకొస్తున్నారు. తాను టీడీపీకి దూరం అయిన తర్వాత నియోజకవర్గంలో కొంత మంది అనుచరులు.. దూరం కావడంతో.. వారందర్నీ మళ్లీ తనతో పాటు నడిచేలా చేసుకునేందుకు ఆయన గ్రామాలు పర్యటిస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉంటానని.. టీడీపీకి దూరం అయినందున.. వైసీపీకి దగ్గరగా ఉన్నందున.. ప్రభుత్వం తరపున పనులు అవుతాయని.. చీటికి మాటికి కేసులు ఉండవని.. ఆయన అనుచరులకు చెబుతున్నారు. కొంత మంది వల్లభనేని వంశీ వాదనతో ఏకీభవించి ఆయనతో.. అటూ ఇటూ కాకుండా.. ఏ పార్టీలో లేకుండా ఉండేందుకు సిద్ధమయ్యారు.
జగన్మోహన్ రెడ్డి.. తన పార్టీలో ఎవరు చేరాలన్నా… రాజీనామా చేసి తీరాల్సిందేనని ఓ నియమం పెట్టుకున్నారు. అసెంబ్లీలోనే కాదు బయట కూడా ఈ నీతి వాక్యాలను ప్రవచించారు. అలాగే… స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా… ఇదే సూత్రాలను వల్లించారు. టీడీపీ రాజ్యసభ సభ్యులను.. బీజేపీలో విలీనం చేసినప్పుడు.. నేరుగా ఆయనపైనే విమర్శలు చేశారు. అలాంటిది ఇప్పుడు.. వంశీ.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన తర్వాత చర్యలు తీసుకోకపోతే.. ప్రజల్లోకి మరో రకంగా వెళ్తుంది. ఈ కారణంగానే వంశీ వైసీపీలో చేరిక.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆలస్యం అవుతోంది. తర్వాత వ్యూహం మార్చుకున్నప్పుడు.. ఆయన రాజీనామా చేసి.. వైసీపీలో చేరే అవకాశం ఉంది.