హైదరాబాద్: విజయవాడ నగరంలో అధికారులు చేపట్టిన ఇళ్ళ తొలగింపు కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం రామవరప్పాడు రైవస్ కాల్వ గట్టుపైనున్న ఇళ్ళను తొలగించటానికి అధికారులు ప్రయత్నాలు జరుపుతుండగా, ఆ ఇళ్ళలో ఉంటున్న బాధితులు విజయవాడ – విశాఖపట్నం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీనితో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక వ్యక్తి కిరోసిన్ వంటిపై పోసుకోవటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బాధితులకు అండగా గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వల్లభనేని వంశీ రంగంలోకి దిగారు. తమ నియోజకవర్గంలో 14-15 రకాల భూసేకరణ ఉందని, ఈ భూ సేకరణవల్ల ఇబ్బంది పడుతున్నామని తాను ఒక వారం రోజుల క్రితం ముఖ్యమంత్రికి కూడా చెప్పానని వంశీ తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని తనకు చెప్పినట్లు వెల్లడించారు. అయితే ఈ లోపుగానే కలెక్టర్ రెవెన్యూ సిబ్బందిని, పోలీసులను తీసుకొచ్చి ఇళ్ళ తొలగింపు మొదలు పెట్టారని చెప్పారు. తాను నిన్నకూడా ముఖ్యమంత్రి దీనిపై తనకు చెప్పిన విషయాన్ని కలెక్టర్కు తెలియజేశానని, అయినా కూడా ఆయన పట్టించుకోకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆరోపించారు. దేవినేని నెహ్రూకు చెందిన కళ్యాణమండపం తదితర ఆస్తులను కాపాడటానికి, పేదవాళ్ళ ఇళ్ళను తొలగిస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా తాను కూడా బాధితుల ఆందోళనకు మద్దతు పలుకుతున్నానని, తాను ఎమ్మెల్యేగా ఉన్నంతవరకు వీరికి ఎటువంటి అన్యాయం జరగనివ్వనని వంశీ చెప్పారు. బాధితుల ఆందోళన తీవ్రంగా ఉండటంతో అధికారులు ఇళ్ళ తొలగింపును నిలిపేసి వెనుదిరిగారు.