హైదరాబాద్: కాల్‌మనీ వ్యాపారాన్ని, వడ్డీ వ్యాపారాన్ని వేర్వేరుగా చూడాలని గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీ అన్నారు. ఏదైనా అత్యవసరమైన పనిమీద, బ్యాంకుల్లో రుణం దొరకనప్పుడు బయట వడ్డీవ్యాపారుల దగ్గర అప్పులు తీసుకుంటారని అన్నారు. అది ఎదుటివ్యక్తికి చెడు చేయనంతవరకు చట్టబద్ధమేనని చెప్పారు. అది హద్దు మీరిపోయి విపరీతమైన వడ్డీలు గుంజి అవతలివాళ్ళను వాడుకునేస్థాయికి వెళితే వడ్డీ వ్యాపారాన్ని కూడా సహించగూడదని అన్నారు. ఇప్పుడు వడ్డీ వ్యాపారం కంటే కాల్ మనీ కొత్తగా తయారయిందని చెప్పారు. వీళ్ళు విపరీతంగా జలగల్లాగా పీడించటం, కుటుంబసభ్యులను వేధించటం, మహిళలను వేధించటం, లైంగికంగా వాడుకోవటం, వ్యవస్థీకృతంగా నేరాలు చేయటం చాలా తప్పని అన్నారు. సభ్యసమాజంలో ఏ ఒక్కరూ, ఏ ఒక్క రాజకీయ పార్టీకూడా దీనిని సమర్థించకూడదని చెప్పారు. ఈ వ్యవహారంలో ఎవరున్నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. నిడమానూరు మెట్రో రైల్ డిపో వల్ల చాలామంది నిరాశ్రయులు కానున్నారని, వీరందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని వంశీ చెప్పారు.