వైసీపీ నేతలు, అధికారులు వేధిస్తున్నారని.. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని.. టీడీపీ అధినేతకు.. వాట్సాప్లో గంభీరమైన లేఖ రాసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. వైసీపీలో చేరడానికి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. నవంబర్ మూడు లేదా నాలుగో తేదీల్లో ముఖ్యమంత్రి సమయాన్ని బట్టి .. ఆయన కండువా కప్పుకోబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అనుచరులకు సమాచారం ఇచ్చిన వంశీ… అందర్నీ గ్రామాల వారీగా.. తనకు మద్దతుగా ఉండాలని కోరుతున్నారు. తనతో పాటు వచ్చే వారందరి విషయంలో ఓ అవగాహనకు వస్తున్నారు. గన్నవరంలో తన కార్యాలయం నుంచి ఇప్పటికి.. టీడీపీ జెండాలు, చంద్రబాబు ఫోటోలను తొలగించారు. ఇక జగన్ ఫోటోలు… వైసీపీ రంగులు పూయడమే మిగిలింది.
అనుచరులను కాపాడుకోవడానికే రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చంద్రబాబుకు చెప్పిన వంశీ.. ఇప్పుడు ఆ అనుచరులను కాపాడుకోవడానికే.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా.. చెప్పే అవకాశం కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి.. తనను.. తన అనుచరుల్ని ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని వంశీ చెబుతున్నారు. దీనంతటికి వైసీపీలో చేరడమే పరిష్కారమని.. నమ్ముతున్నారు. వైసీపీలో చేరితే తన కేసులకు.. తన ఆస్తులకు రక్షణ ఉంటుందని… వంశీ ఆలోచన అని అనుచర వర్గాలు చెబుతున్నాయి.
మరో వైపు వల్లభనేని వంశీతో మాట్లాడేందుకు.. చంద్రబాబు.. కేశినేని నాని, కొనకళ్ల నారాయణలను పురమాయించారు. వారు.. వంశీతో మాట్లాడేందుకు ఫోన్లు చేశారు. స్విచ్ఛాఫ్ రావడంతో.. మాట్లాడలేకపోయామని వారు చెబుతున్నారు. మళ్లీ వల్లభనేని వంశీతో మాట్లాడేందుకు వారు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో.. తెలుగుదేశం పార్టీ కూడా వంశీ విషయాన్ని లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. వంశీ చేరికతో.. గన్నవరం నియోజకవర్గం.. వైసీపీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది. యార్లగడ్డ వెంకట్రావు ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి కూడా అపాయింట్మెంట్ ఖరారు చేయడం లేదు.