వల్లభనేని వంశీ వైసీపీ హైకమాండ్ చెప్పినట్టల్లా చేస్తున్నారు. బూతులు తిట్టమంటే తిడుతున్నారు. జూమ్ కాల్స్లోకి చొరబడమంటే చొరబడుతున్నారు. అయితే ఆయనకు నియోజకవర్గంలో ఇతర నేతలు వ్యతిరేకంగా ఉండకుండా చేయడంలో మాత్రం వైసీపీ పెద్దలు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు.గత ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి వంశీని ఓడించినంత పని చేసిన యార్లగడ్డ వెంకట్రావు మళ్లీ వచ్చారు. కొంత కాలంగా ఆయన అమెరికాలో ఉంటున్నారు. గన్నవరం రాజకీయాలు పట్టించుకోలేదు. దీంతో దుట్టా వర్గమే వల్లభనేనితో పోరాడుతూ వస్తోంది.
తాజాగా యార్లగడ్డ వెంకట్రావు కూడా రంగంలోకిదిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విలన్ తో పోటి చేశానని. అతన్ని పార్టీలోకి తీసుకునే సమయంలోనే వ్యతిరేకించాను.. ప్రతిసారి నేను అధిష్టానం తో పోరాటం చేయలేనని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. వ్యక్తిగత పని మీదా ఒక 6 నెలల అమెరికా వెళ్లానని ఆ సమయంలో తాను టీడీపీతో టచ్లోకి వెళ్లినట్లుగా ప్రచారం చేశారని..కానీ తాను వైసీపీలోనే ఉన్నానన్నారు. రాజకీయం చేయాల్సిన సమయంలో రాజకీయం చేస్తానని.. సీఎం జగన్మోహన్ రెడ్డి నన్ను పార్టీలోకి తీసుకవచ్చారని అయన వెంట నడుస్తానని చెబుతున్నారు.
నాకు ఏదైనా బాధ్యత ఇస్తే పని చేసి చూపిస్తాం ఇవ్వకుండా ఏలా పనిచేసేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నప్పుడు ఒక తట్టమట్టి తవ్వలేదు కనీసం ఒక్క పైసా అవినీతి కి పాల్పడలేదు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటి చేస్తాను . ఏ పార్టీ నుంచి బరిలో దిగుతానన్న దానిపై అనేక మంది ఊహాగానాలు చేస్తున్నారని.. దాని వల్ల తన స్థాయి పెరిగిందని చెప్పుకొచ్చారు. మొత్తానికి యార్లగడ్డ మరోసారి తన రాజకీయ అవకాశాలు వెదుక్కుంటూ రావడంతో వంశీకి మరో మైనస్ వచ్చి పడినట్లయింది.