వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ను సీఐడీ కోర్టు డిస్మిస్ చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయన ఏ 71గా ఉన్నారు. ఆ కేసులో గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో దిగువకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. అయితే ఇప్పుడు వంశీ జైల్లో ఉంది ఈ కేసులో అరెస్టు అయి కాదు. ఆ కేసు ఫిర్యాదు దారుడ్ని కిడ్నాప్ చేసి..బెదిరించి .. కేసు ఉపసంహరించుకుంటున్నట్లుగా కోర్టులో చెప్పించినందుకు అరెస్ట్ అయ్యారు. ఫిబ్రవరి13న ఆయనను హైదరాబాద్ లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైల్లో ఉన్నారు.
సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి.. తన ఇంటికి తీసుకెళ్లి బెదిరించి కేసు ఉపసంహరింపచేశారనేది వంశీపై అభియోగం. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనే ఆయనకు బెయిల్ రాలేదు అంటే.. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దాదాపుగా రాకపోవచ్చని భావిస్తున్నారు. బెయిల్ షరతుల్లో ప్రధానంగా ఉండేది సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని. అయితే వంశీ అసలు బెయిల్ రాక ముందే ఏకంగా ఫిర్యాదు దారునే బెదిరించి.. కిడ్నాప్ చేసి.. బలవంతంగా ఫిర్యాదును ఉపసంహరింప చేశారు. స్వయంగా ఫిర్యాదు దారును తన ఇంటికి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. అరెస్టు కాక ముందు ఫిర్యాదుదారుడిపైనే ఇలా వ్యవహరిస్తే బెయిల్ ఇస్తే ఇక సాక్షులను ప్రభావితం చేయకుండా ఎలా ఉంటారన్న ప్రశ్నలు వస్తాయి. అందుకే కోర్టు అంత తేలికగా వంశీకి బెయిల్ మంజూరు చేయదని అంటున్నారు.
ఎగువ కోర్టుల్లోనే ఆయన ప్రయత్నించాల్సి ఉంటుందని అంటున్నారు. మరో వైపు ఆయన భద్రత కారణంగా ఒక్కడినే ఉంచుతున్నారు. కానీ తనను అందరితో పాటు ఉంచాలని ఆయన కోరుతున్నారు. ఇతర కేసుల్లోనూ ఆయనపై విచారణలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా సిట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కారణంగా వంశీ ఇప్పుడల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు లేవని భావిస్తున్నారు.