మిక్కీ జే మేయర్ అనగానే హాయి గొలిపే మెలోడీ పాటలే గుర్తొస్తాయి. హీరో ఎవరైనా సరే – మెలోడీ పాటలే అందిస్తారాయన. అందుకే క్లాస్ సినిమాలకే మిక్కీని సంగీత దర్శకుడిగా ఎంచుకునేవారు. `వాల్మీకి` పక్కా మాస్ సినిమా. ఈ సినిమాకి మిక్కీ సంగీతం అనేసరికి.. అందరూ ఆశ్చర్యపోయారు. మాస్ పల్స్కి తగ్గట్టు ట్యూన్స్ ఎలా ఇస్తాడో అనుకున్నారు. అయితే ఆ బెంగలన్నీ ఒక్క పాటతో తీర్చేశాడు మిక్కీ. వాల్మీకిలోని `జర్ర జర్ర` పాట ఈరోజే విడుదలైంది. పక్కా మాస్ బీట్ ఇది. బీ, సీలలో హోరెత్తే ఐటెమ్ నెంబర్ ఇది. ఈ పాటలో.. తన మాస్ పవర్ మొత్తం చూపించేశాడు మిక్కీ జే.మేయర్. మిక్కీలో ఇంత మాస్ ఉందా? అనేంత రేంజ్లో పాటని కంపోజ్ చేశాడు. దానికి తోడు… ఐటెమ్ పాటల స్పెషలిస్టు భాస్కర భట్ల.. కలం జోరుగా సాగింది. రిథమ్, బీట్, ట్యూను, హోరూ.. అన్నీ కలగలిపి.. జర్ర జర్ర కుర్రకారు కి కిర్రెక్కించే పాటగా మిగిలిపోయింది. వరుణ్ తేజ్ చేసిన సినిమాల్లో వినిపించిన పాటల్లో వినిపించిన మాస్ గీతం కూడా ఇదే కావొచ్చు. థియేటర్లో ఓ ఊపు ఊపే సత్తా ఈ పాటకు ఉన్నట్టు ఇప్పటికే అర్థమైపోతోంది. దాన్ని హరీష్ శంకర్ ఎలా తీశాడో చూడాలి.