ఎన్టీఆర్ కెరీర్లో బృందావనం మర్చిపోలేని చిత్రం. ఆ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యాడు ఎన్టీఆర్. ఇదే సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించుకున్నాడు వంశీ పైడిపల్లి. `మున్నా`తో జరిగిన డామేజ్ని… ఈ సినిమాతో తీర్చుకోగలిగాడు. బృందావనంతోనే… వంశీ పైడిపల్లి దర్శకుడిగా నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు చేసే రేంజ్కి చేరుకున్నాడు. ప్రస్తుతం తమిళ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి ఓసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత.
విజయ్ తొలిసారి తెలుగులో నటిస్తున్న సినిమా ఇది. అందుకే అంచనాలు పెరుగుతున్నాయి. విజయ్ కి మాస్ ఇమేజ్ పుష్కలంగా ఉంది. వంశీ కూడా మాస్ సినిమాల్ని బాగా తీయగలడు. కానీ.. ఈసారి విజయ్ కోసం పూర్తి ఫ్యామిలీ డ్రామాని ఎంచుకున్నాడని తెలుస్తోంది. బృందావనం లా.. ఇది ఓ కుటుంబం చుట్టూ తిరిగే కథ అట. బంధాలు బంధుత్వాలు ముఖ్యమని, అంతా కలిసికట్టుగా ఉంటే.. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలం అని చెప్పే సినిమా ఇదని తెలుస్తోంది. బృందావనం ఫ్లేవర్ కూడా ఇలాంటిదే. విజయ్ ఫ్యామిలీ డ్రామాలు చేసి చాలా కాలమైంది. ఆమాటకొస్తే తన కెరీర్లో ఫ్యామిలీ డ్రామాలకు స్కోప్లేదు. అందుకే.. ఈ కథపై విజయ్ మొగ్గు చూపించాడట. తనకు నచ్చిన జోనర్ కావడం వల్లే దిల్ రాజు కూడా ఈ కథని పట్టాలెక్కించాడట. బృందావనం తీసిన ఓ దర్శకుడు.. నిర్మాత కలిసి, మళ్లీ అలాంటి ఫ్లేవర్లోనే ఓ కథ అల్లుకోవడం.. ఆశ్చర్యమే.