సీరియర్ వంశీ సినిమాల గురించి, ఆయన స్టైల్ గురించీ పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొంతకాలంగా వంశీ సినిమాలు చేయడం లేదు. కాకపోతే.. ఈమధ్య ఓ యూ ట్యూబ్ ఛానల్ మొదలెట్టారు. ఓ సీరియర్ దర్శకుడు, కళా పోషకుడు యూ ట్యూబ్ ఛానల్ పెట్టడం కాస్త కొత్త విషయమే. అయితే ఈ యూ ట్యూబ్ ఛానల్ లోనూ వంశీ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.
తొలుత ఓ వీడియో పోస్ట్ చేశారు వంశీ. ఇది మామూలు వీడియోలకంటే భిన్నంగా కనిపించింది. వంశీ తన ఫ్లాట్ లోకి కెమెరా తీసుకెళ్తూ.. ఓ నేపథ్య సంగీతాన్ని వినిపించారు. వంశీ సినిమాల్లో హీరోయిన్లు తలుపు చాటు నుంచో, పరదాల చాటు నుంచో అందంగా కనిపిస్తుంటారు. ఇక్కడా వంశీ అదే చేశారు. ఓ తలుపు మాటున నిలబడి… తనని తాను పరిచయం చేసుకొన్నారు. అంతేకాదు… 72 రాగాల పేర్లు పరిచయం చేస్తూ ఓ పాటకు ట్యూన్ కట్టారు. ఆ పాట ఈ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. వంశీ దర్శకుడు, రచయితే కాదు… సంగీత దర్శకుడు కూడా. జోకర్ సినిమాకి ఆయనే స్వరాలు అందించిన విషయం తెలిసి ఉంటుంది. ఆ పరిజ్ఞానంతో ఈ ట్యూన్ కంపోజ్ చేశారు. 72 రాగాల పేర్లు గుర్తు పెట్టుకోవడానికి వంశీ చేసిన చిన్న ప్రయత్నం ఇది. యూ ట్యూబ్ ఛానల్ లోనూ క్రియేటివిటీ చూపించొచ్చన్న సంగతి ఈ వీడియోతో జనాలకు మరోసారి అర్థమైంది. మొత్తానికి వంశీ స్టైలే వేరు. కాదంటామా?!