గన్నవరంలో రాజకీయం రాను రాను గరంగరంగా మారుతోంది. వంశీ వైసీపీలో చేరిన తర్వాత పరిస్థితి ఒక్క సారిగా ఉద్రిక్తంగా మరిపోయింది. గతంలో పోటీ చేయలేనని చెప్పిన దుట్టా రామచంద్రరావు, గత ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఎవరికి వారు వంశీతో పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురి మధ్య వైసీపీ మూడు వర్గాలుగా మారింది. వంశీ ఎమ్మెల్యేగా ఉండటంతో సహజంగానే ఆయనకు అడ్వాంటేజ్ లభిస్తోంది. మిగిలిన ఇద్దరు నిరాదరణకు గురవుతున్నారు. యార్లగడ్డ వెంకట్రావుకు తాజాగా.. నియోజకవర్గంలో గతంలో వల్లభనేని వంశీకి ఎలాంటి పరిస్థితి ఉండేదో.. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు బలప్రదర్శన చేయాలనుకున్నారు. గన్నవరం నియోజకవర్గం వ్యాప్తంగా భారీ కార్యక్రమాలకు ప్లాన్ చేశారు.
కానీ పోలీసులు ఈ విషయం ముందే తెలుసుకుని.. క్యాడర్ మొత్తానికి వార్నింగ్ పంపారు. ఎవరైనా జన సమీకరణ చేసి..పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తే.. కేసులు పెడతామని హెచ్చరికలు పంపించారు. ఇందు కోసం అక్కడక్కడా చేసిన ఏర్పాట్లను చూసి పోలీసులు తీసివేయించారు. దీంతో యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి తల కొట్టేసినంత పనయింది. సాధారణంగా టీడీపీ నేతల కార్యక్రమాలకు పోలీసులు ఇలా అడ్డు పడతారు. వైసీపీలో కీలకంగా ఉండి.. వంశీపై పోరాడిన తమ నేతకు ఈ దుస్థితి ఏమిటని యార్లగడ్డ వర్గీయులు మథనపడుతున్నారు. పోలీసులు ఇలా వ్యవహరించడం వెనుక వంశీ హస్తం ఉందని.. తాను హైకమాండ్‌తోనే తేల్చుకుంటానని యార్లగడ్డ అంటున్నారు.
మరో వైపు వంశీ వర్గీయులు.. దూకుడు మీద ఉన్నారు. దుట్టా వర్గీయులతో పలు చోట్ల ఘర్షణలకు దిగుతున్నారు. ఎక్కడైనా కంబైన్డ్‌గా పార్టీ తరపున కార్యక్రమం లేదా.. ప్రభుత్వ తరపున కార్యక్రమం నిర్వహించాలంటే.. అక్కడ రసాభాస అవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ .. టీడీపీలో నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉండేవారు. కానీ వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఆయన జాతకం తిరగబడింది. టీడీపీ అక్కడ ఇన్చార్జ్గా బీసీ వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడును ఇన్చార్జ్గా నియమించింది. దాంతో టీడీపీ వర్గీయులందరూ ఏకమవుతున్నారు. మూడు ముక్కలాట చివరికి గన్నవరం వైసీపీని.. వంశీని ఎక్కడ తేలుస్తుందో అని వైసీపీలోనే కంగారు ప్రారంభమయింది.