ఊపిరి సినిమాకు రూ.21 కోట్లు నష్టం వచ్చింది.. దానికి సమాధానం చెప్పాలి అంటూ వంశీపైడిపల్లిని లాక్ చేశాడు పీవీపీ ప్రసాద్. అంతేనా…??? మహేష్‌తో వంశీ చేయబోయే కథపై నాకూ హక్కులున్నాయి అంటూ ఆ సినిమా మొదలవ్వకుండా స్టే ఆర్డరు తెచ్చుకొన్నాడు. అయితే ఇప్పటి వరకూ వంశీ ఈ విషయంలో నోరు మెదపలేదు. తన వాదన వినిపించుకోలేదు. టాలీవుడ్లో ఓ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఇదే తొలిసారి. అందుకే వంశీపైడిపల్లి ఆచి తూచి స్పందించాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది.
వంశీ ముందున్న మార్గాలు రెండే. ఒకటి…. పీవీపీతో రాజీ కుదుర్చుకోవడం. రెండోది మహేష్‌తో చేయబోయే సినిమాలో పీవీపీని పార్టనర్‌గా చేర్చుకోవడం. రెండోది ఎలాగూ కుదిరే పనికాదు. అందుకే రాజీ కుదుర్చుకోవడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. అందుకే ఈ వివాదాన్ని దాసరి నారాయణరావు ముందు పెట్టాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఊపిరి సినిమా చూసి దాసరి ఎగ్జయిట్ అయ్యారు. వంశీని పిలిపించి మాట్లాడారు. అభినందించారు. దాసరి ఎప్పుడూ దర్శకుల పక్షమే. ఆయనే తనకో దారి చూపిస్తారని నమ్ముతున్నాడు వంశీ. పెద్దలతో కూర్చుని మాట్లాడితేగానీ.. ఈ వివాదం సద్దుమణగదు అంటూ దిల్‌రాజు లాంటి వాళ్లు కూడా వంశీకి సలహాలు ఇస్తున్నారు. అందుకే ఈ విషయమై వంశీ ఇప్పటి వరకూ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. తాను ఏం మాట్లాడినా ఇష్యూ ఇంకా పెద్దదైపోతుందని తనకు తెలుసు. దాసరి ముందో, ఇండ్రస్ట్రీ పెద్దల ముందో, లేదంటే దర్శకుల సంఘం ముందో తన వాదన వినిపించి.. వాళ్ల అభిప్రాయాలు తెలుసుకొని అప్పుడు తదుపరి స్టెప్ వేయాలనుకొంటున్నాడట. పీవీపీ తాజా ఎత్తుగడతో మహేష్ – వంశీ పైడిపల్లి సినిమా ఇబ్బందుల్లో పడింది. వీటన్నింటికీ వంశీ ఎలా దాటుకొని వస్తాడో మరి.