ప్రతీ ఒక్కరికీ సినిమాపై ఓ అభిప్రాయం ఉంటుంది. దాన్ని నిర్మొహమాటంగా వ్యక్త పరచవచ్చు కూడా. కానీ సినిమావాళ్లు మాత్రం తోటి సినిమాలపై మాట్లాడేటప్పుడు కాస్త జాగురతతో ఉండాలి. ఆచి తూచి వ్యవహరించాలి. లేదంటే… ట్రోలర్స్‌కి దొరికేస్తారు. ఓ సినిమా గురించి, అందులోనూ జనాదరణ పొందిన సినిమా గురించి.. కాస్త అటూ ఇటూగా మాట్లాడితే మాత్రం.. ట్రోలర్స్‌కి పిలక అందించినట్టే. వాళ్ళ పాత సినిమాల చరిత్రని తవ్వి.. జాతకాల్ని మరోసారి బయటపెడతారు నెటిజన్లు. ఇప్పుడు ‘సితార’ వంశీ విషయంలో ఇదే జరుగుతోంది.
పక్క సినిమాల గురించి ఎప్పుడూ పట్టించుకోని వంశీ.. తాజాగా `అవతార్ 2`పై సెటైరికల్ కామెంట్లు చేశాడు. ఇదో మెరైన్ బయాలజీ డాక్యుమెంటరీ అని, జేమ్స్ తీశాడు కాబట్టి.. దీన్ని దృశ్యకావ్యం, మాస్టర్ క్రాఫ్ట్, బ్లాక్ బస్టర్ అని పిలవాలని, లేదంటే `నావి` ఒప్పుకోదని… కాస్త వ్యంగంగా కామెంట్లు చేశాడు. దాంతో.. నెటిజన్లకు, ట్రోలర్లకు దొరికిపోయాడు వంశీ. `రీమేక్ సినిమాలు తీసే నీకు.. అవతార్ ఏం నచ్చుతుందిలే..` అంటూ ట్రోలర్స్ వీరలెవిల్లో ఆడుకొంటున్నారు. త్రివిక్రమ్ కి చెప్పి.. రీమేక్ సినిమా తీసుకో.. ఆయనేమో.. ఇంగ్లీష్ సినిమాల్ని కాపీ చేసి కథలు రాస్తుంటాడు. అంటూ ఈ ఇష్యూలో త్రివిక్రమ్‌ని, పవన్ నీ లాగుతున్నారు. కొంతమంది… దారుణమైన కామెంట్లు చేసి.. వంశీ పరువు తీసి పారేస్తున్నారు. ఫామ్ లో ఉండి, సినిమాలతో నిత్యం బిజీగా ఉండే వంశీ లాంటి నిర్మాత… పాపులర్ సినిమాలపై కామెంట్లు చేస్తే ఇలానే ఉంటుంది వ్యవహారం. `అవతార్ 2`పై అనవసరంగా ట్వీటు జారి.. అడ్డంగా ట్రోలర్స్ కి దొరికిపోయాడు.