వంశీ.. ఈ పేరే ఓ బ్రాండ్. అచ్చమైన గోదారి కథలు, స్వచ్ఛమైన మనుషులు, వినోదం.. ఇయన్నీ చూడాలంటే వంశీ సినిమాలకు వెళ్లాల్సిందే. ఏప్రిల్ 1 విడుదల, చెట్టు కింద ప్లీడర్, సితార, అన్వేషణ.. ఇవన్నీ సూపర్ హిట్ సినిమాలే. వంశీ టేకింగు ఓ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. మేకింగ్ విషయంలో పెద్దగా ఖర్చు పెట్టరు. వీలైనంత ఈజీగా, తక్కువలో లాగించేయాలని చూస్తారు. కంటెంట్పరంగానో, పాటల పరంగానో, కామెడీ పరంగానో వంశీ సినిమాలు హిట్టయ్యాయి తప్ప… ఆయనేదో మేకింగ్ విషయంలో క్వాలిటీ చూపించారని కాదు. అయితే ఇప్పుడు రోజులన్నీ మారిపోయాయి. సీరియళ్లు సైతం కళకళలాడిపోతూ కనిపించాల్సిందే. ఎంత ఖర్చు పెడితే అంత గొప్పగా వస్తుందని నమ్ముతున్నారు. అయితే.. ఈసారీ వంశీ తన పాత పద్ధతిలోనే వీలైనంత తక్కువలో సినిమా చుట్టేశారట.
ఆయన తాజా చిత్రం `ఫ్యాషన్ డిజైనర్, సన్నాఫ్ లేడీస్ టైలర్`. జూన్లో విడుదల అవుతోంది. సుమంత్ అశ్విన్ కథానాయకుడు. అతగాడికా మార్కెట్ లేదు. వంశీ సినిమా అంటే పొలోమంటూ.. మొదటి రోజే టికెట్లు తెగవు. అందుకే ఆచి తూచి ఖర్చు పెట్టాలి. పాటల విషయంలో తన స్టైల్ చూపించాడని, సన్నివేశాల తీత విషయంలో పొదుపు పాటించారని, అందుకే ఆయా సీన్లన్నీ చుట్టేసినట్టు వచ్చాయన్నది ఇన్నర్ టాకు. వంశీ సినిమా.. లేడీస్ టైలరూ అంతే కదా. ఆ గోదారి గట్లు, పెంకుటిళ్లూ తప్ప పెద్దగా ఏం కనిపించవు. అది హిట్టవ్వలేదూ. ఈసినిమా కూడా అంతే అనుకోవాలి మరి.