నటుడు తనికెళ్ల భరణి ఒకప్పుడు.. స్టార్ రైటర్. దాదాపుగా 50 సినిమాలకు పనిచేశారు. అందులో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లూ ఉన్నాయి. అయితే చాలా కాలం నుంచి ఆయన పెన్ను చేసుకొన్నది లేదు. ఆ మాట అడిగితే… ”నటుడిగా బోల్డంత బిజీగా ఉన్నా.. ఈ టైమ్‌లో మళ్లీ రైటర్ని గుర్తు చేసుకోదలచుకోలేదు” అనేవారు. అలా అన్నవారే… ‘లేడీస్ టైలర్’కి సీక్వెల్ ‘ఫ్యాషన్ డిజైనర్’కి పని చేశారు. నాలుగేళ్ల క్రితమే.. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్థాయి స్ర్కిప్టును తయారు చేశారు తనికెళ్ల భరణి. ఇటీవల వంశీతో కలసి గోదావరి తీరంలో ప్రయాణం చేసి.. స్ర్కిప్టులో మార్పులు చేర్పులూ కూడా చేశారు. ఈ సినిమా ఇప్పుడు ఎమ్మెస్రాజు తనయుడు సుమంత్ అశ్విన్ తో రూపొందుతోంది. మధ్యలో ఏం జరిగిందో ఏమో.. తనికెళ్ల భరణి స్ర్కిప్టును పక్కన పెట్టేశాడు వంశీ.
ఇప్పుడు కొత్తగా మళ్లీ కథ వండుకొని, డైలాగులతో సహా రాసుకొన్నార్ట. వంశీ పాతికేళ్ల క్రితం తీసిన లేడీస్ టైలర్‌కి సీక్వెల్ ఇది. ఆ కథ, మాటలు అందించినది తనికెళ్ల భరణీనే. రవితేజ తో ఈ సినిమాకి సీక్వెల్ చేద్దామన్న ఉద్దేశంతో భరణి తో స్ర్కిప్టు రాయించుకొన్నారు. అప్పటికే నటుడిగా బిజీగా ఉన్న భరణి… కేవలం వంశీపై ఇష్టంతో, లేడీస్ టైలర్‌పై ఉన్న ప్రేమతో కథ, మాటలు రాయడానికి ఒప్పుకొన్నాడు భరణి. అయితే ఇప్పుడు ఆ స్ర్కిప్టుని పూర్తిగా పక్కన పెట్టేశారు. భరణిని దూరం చేయడంలో వంశీ ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. అయితే ఈ విషయంపై భరణి కూడా స్పందించారు. ”ఫ్యాషన్ డిజైనర్ కథ, స్ర్కిప్టు నేనే సిద్దం చేశా. అయితే.. అది చాలా పాత విషయం. ఇప్పుడు ఆ సినిమా మొదలైంది. రచయితగా నాకు కబురు రాలేదు. అంటే అది నా కథ కాదనే కదా” అంటున్నారాయన. మరీ ఇంతకాలం పనిచేయించుకొని.. మాట వరసకైనా చెప్పకుండా రచయితని పక్కన పెట్టడం ఏమిటి?? దారుణం కదూ.