జబర్దస్త్ కమెడియన్స్ రీతూ చౌదరి అలియాస్ వనం దివ్య, ఆమె భర్త శ్రీకాంత్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమాల్లో చిన్న చిన్న వేషాల కోసం తిరిగిన వారు వందల కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు.. ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది. వీరు జగన్ రెడ్డి భార్య భారతి బినామీలని.. జగన్ రెడ్డి పీఏ నాగేశ్వర్ రెడ్డి సహకారంతో దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఆస్తులు కొట్టేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు అరెస్టు చేసిన మాజీ రిజిస్ట్రార్ ధర్మసింగ్ రాసిన లేఖపై అధికారులు ప్రాథమిక విచారణ చేస్తే సంచలన విషయాలు వెలుగలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఎనీవేర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని ధర్మసింగ్ తో కలిసి శ్రీకాంత్, వనం దివ్య ఆస్తులు రాయించుకున్నారు. వీరు కొనుగోలు చేసినట్లుగా పత్రాలు రాయించుకున్న ఆస్తుల లావాదేవీల్లో డబ్బులు కట్టలేదు. కానీ డబ్బులు కట్టినట్లుగా రాసుకున్నారు. మామలుగా అయితే చెక్కు నెంబర్లు నమోదు చేయాలి. ఈ డాక్యుమెంట్లు మొత్తం నగదు లావాదేవీలతో జరిగాయని రాసుకున్నారు. రెండు లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరగకూడదన్న నిబంధన ఉంది.అంటే ఇక్కడ ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిగిపోయింది కానీ.. డబ్బుల లావాదేవీల జరిగాయో లేదో తెలియదు. ఇలాంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాన్ వివరాలు నమోదు చేయాలి. అది కూడా చేయలేదు.అంటే ఈ లావాదేవీలు జరిగినట్లుగా ఎవరికీ తెలియదు కానీ ఆస్తులు మాత్రం పేరు మారిపోయాయి.
వనం దివ్య, శ్రీకాంత్ ఇద్దరూ చేసిన దందాలతో రూ.రెండు వందల కోట్లు విలువ చేసే ఆస్తులు చేతులు మారాయి. వీరికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది?. వీరు సినిమాల్లో చిన్న చిన్న వేషాలకు ట్రై చేసేవారే. అయితే ఎక్కడ పరిచయం అయ్యారో కానీ తాడేపల్లి పెద్దలు వీరికి పరిచయమయ్యారు. అక్కడే అంతా మలుపు తిరిగినట్లుగా తెలుస్తోంది. వీరిని బినామీలుగా పెట్టుకుని తాడేపల్లి ప్యాలెస్ లోని కొంత మంది పెద్దలు.. సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ను బెదిరించి పని పూర్తి చేశారు. సహజంగానే అవినీతి పరుడు అయిన మాజీ రిజిస్ట్రార్ ధర్మసింగ్ .. తనకు కావాల్సింది పుచ్చుకుని పని పూర్తి చేశాడు.కానీ ఇప్పుడు తనను నిండా ముంచేశారని గుర్తించి మొత్తం బయట పెట్టాడు.
ఈ వ్యవహారంపై కేసులు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తీగ లాగితే శ్రీకాంత్, దివ్యల జంట జబర్దస్త్ రిజిస్ట్రేషన్ల గుట్టు ఎక్కడ తేలుతుందో అంచనా వేయడం కష్టమే అనుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దందాల్లో ఇదీ ఒకటీ. ఇంకెన్ని చూడాలో !