వంగా గీతను పవన్ కల్యాణ్ పార్టీలోకి ఆహ్వానించడం సంచలనంగా మారింది. పిఠాపురం కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. తాను పోటీ చేయబోయే నియోజకవర్గం నుంచి కొందరు పార్టీలో చేరారు. ఇదే సందర్భంలో పవన్ ఓ సంచలన కామెంట్ చేశారు. పిఠాపురం తనకు ప్రత్యర్థిగా వైసీపీ తరపున అభ్యర్థిగా నిలబడిన వంగా గీతను జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.
సహజంగా తనకు ప్రత్యర్థిగా ఉండే అభ్యర్థుల్లోని మైనస్సులను ప్రజల్లోకి చెప్పడం.. వారిలోని లోపాలను తప్పు పట్టడం వంటివి చేస్తారు. కానీ పవన్ రోటీన్‌కు భిన్నంగా స్పందించారు. 2009లో పీఆర్పీ నుంచే వంగా గీత గెలిచారని గుర్తు చేశారు. ఆమె మంచి మహిళా నేత అని.. ఆమె ఆ పార్టీలో ఉండాల్సిన వ్యక్తి కాదని.. వంగా గీతను జనసేన పార్టీలో చేరాలని ఆహ్వానించారు పవన్. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వంగా గీతకు పవన్ ఎందుకు ఆహ్వానం పలికారు..? అనే అంశంపై జోరుగా చర్చ జరిగింది.
గత ఐదేళ్ల కాలంలో వైసీపీలోని మిగిలిన నేతలతో పోల్చుకుంటే వంగా గీత పవన్ కళ్యాణ్‌ను కానీ.. జనసేన పార్టీని కానీ చాలా తక్కువ సందర్భాల్లో విమర్శించారు. అలాగే జనసేన పార్టీ కూడా వంగా గీతను ఎప్పుడూ వైసీపీలో ఉన్నప్పటికీ తమ శత్రువుగా భావించలేదు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. పిఠాపురంలో గెలవడం అసాధ్యమని వంగా గీతకు కూడా తెలుసు కాబట్టి… నామినేషన్లకు ముందో..తర్వాతో జనసేనలో చేరినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.