హైదరాబాద్: దీర్ఘకాలం తర్వాత ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రం ద్వారా హిట్ కొట్టిన రామ్గోపాల్ వర్మ మరో సంచలన చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. విజయవాడ నగరంలో ఢీ అంటే ఢీ అనేటట్లుగా ఉండే రెండు వర్గాలలో ఒకటైన వంగవీటి వర్గంపై వర్మ సినిమా తీయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో స్వయంగా పేర్కొన్నారు.
వంగవీటి రాధా(వంగవీటి రంగా అన్న) హత్యతో అసలు గొడవ ప్రారంభమయిందని, వంగవీటి రంగా హత్యతో ముగిసిందని అన్నారు. తన తదుపరి చిత్రం పేరు ‘వంగవీటి’ అని ట్వీట్ చేశారు. రాధా ఎదుగుదలతో చిత్రం ప్రారంభమవుతుందని, రంగా మరణంతో ముగుస్తుందని తెలిపారు. అందుకే చిత్రం పేరును వంగవీటి అని పెట్టినట్లు వర్మ వివరించారు.
రామ్గోపాల్ వర్మ గతంలో వంగవీటి రంగాలాగానే మిలిటెంట్ రాజకీయ నాయకుడైన పరిటాల రవి హత్యపై ‘రక్త చరిత్ర’ అనే చిత్రాన్ని రెండు భాగాలుగా తీసిన సంగతి తెలిసిందే. అది బాగానే విజయవంతమయింది. మరి వంగవీటి చిత్రం ఏమవుతుందో చూడాలి. రాధా, రంగా జీవితాలలో కూడా కావలసినంత డ్రామా ఉంది కాబట్టి కథ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ఎవరినీ నొప్పించకుండా తీయటమే వర్మ ముందున్న అసలైన సమస్య. వాస్తవానికి వంగవీటి రాధా కథతో వంగవీటి రంగాయే తాను బతికుండగా ‘చైతన్యరథం’ అనే చిత్రాన్ని భానుచందర్ హీరోగా ధవళ సత్యం దర్శకత్వంలో నిర్మించారు. అది బాగానే విజయవంతమయింది కూడా. ఆ తర్వాత రంగా హత్యకు గురయ్యారు.