వంగవీటి రాధాకృష్ణ.. జనసేనలో చేరబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. విజయవాడలోని పవన్ కల్యాణ్ ఇంట్లోనే.. రెండు సార్లు ఆయనతో సమావేశమై… మూడు, నాలుగు గంటల పాటు చర్చలు జరపడం … పార్టీ మార్పు ఊహాగానాలకు తెరలేచింది. జూలై నాలుగో తేదీన వంగవీటి మోహన్ రంగా.. జయంతి సందర్భంగా.. ఆయన కీలక రాజకీయ ప్రకటన చేస్తారని.. ప్రచారం జరిగింది. అయితే.. జూలై నాలుగు వచ్చింది. రంగా 72వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కానీ.. ఆయన మాత్రం… పార్టీ మార్పు, రాజకీయాల గురించి ఒక్క ప్రకటన కూడా చేయలేదు. పార్టీ మార్పుపై అసలు మాట్లాడలేదు.
వంగవీటి మోహనరంగా ఆశయాల కోసం పని చేస్తానని ఎప్పుడూ చెప్పేవే చెప్పారు కానీ.. రాజకీయాల గురించి చెప్పకపోవడంతో.. అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. జనసేనలో చేరుతారన్న ప్రచారం … ఆ మేరకు ప్రకటన చేస్తారని.. భావించడంతో.. కృష్ణా జిల్లా నలుమూలల నుంచి.. రంగా అభిమానులు తరలి వచ్చారు. కానీ.. రాధాకృష్ణ అలాంటి ప్రకటనలు ఏమీ చేయలేదు. అయితే రంగా ఒక్క వర్గానికి చెందిన వారు కాదని.. అన్ని వర్గాలను సమానంగా చూశారని .. ఆయన అందరి మనిషని ప్రకటించారు. దీంతో.. జనసేనలో ఆయన చేరిక కష్టమేనన్న అభిప్రాయం.. అభిమానుల్లో ఏర్పడింది.
పవన్ కల్యాణ్‌ను.. రెండు సార్లు కలిసిన సందర్భంలో.. వారి మధ్య రాజకీయ చర్చలే నడిచాయని.. జనసేన వర్గాలు చెప్పాయి. అయితే.. అవి పార్టీ చేరిక దిశగానా.. లేక.. మరో లక్ష్యమా అన్నదాన్ని రహస్యంగానే ఉంచారు. పవన్ కల్యాణ్ కూడా.. క్షేత్ర స్థాయి నుంచి నాయకత్వాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు కానీ.. వలస నాయకుల మీద ఎక్కువగా ఆధారపడాలని అనుకోవడం లేదని చెబుతున్నారు. అందుకే…చర్చలు అంసపూర్తిగా ఉన్నాయంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి క్లారిటీ రావొచ్చంటున్నారు.