స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిడమే కాకుండా అనేక రకాల సిత్రాలను ప్రజల ముందుకు తెస్తున్నాయి. విజయవాడ స్థానిక ఎన్నికల సందర్భంగా నిన్న తెలుగుదేశం పార్టీ నేతలే ఒకరిమీద ఒకరు కత్తులు దూసుకుంటే ఇవాళ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వంగవీటి రాధా జనసేన అభ్యర్థుల కోసం ప్రచారం చేయడం స్థానికంగా చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళితే..
వంగవీటి రాధా మొదటి నుండి మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించిన సమయంలో ఆయన పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం లో చేరారు. ప్రజారాజ్యం అంకం ముగిసిన తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరిన రాధా, 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇటీవల చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో ఆయన చురుగ్గా లేరు. అయితే ఈ రోజు అనూహ్యంగా వంగవీటి రాధా, విజయవాడ లో జనసేన తరపున ప్రచారం చేశారు. 15 డివిజన్, 18 వ డివిజన్ మరియు 21 వ డివిజన్ లో లో వంగవీటి రాధా జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
గత కొంతకాలంగా వంగవీటి రాధా సరైన సమయంలో జనసేన పార్టీలో చేరుతారని రూమర్స్ వస్తూ ఉన్నాయి. మరి అందులో భాగంగానే స్థానిక ఎన్నికలలో రాధా జనసేన అభ్యర్థుల కోసం ప్రచారం చేశారా లేక వ్యక్తిగతంగా తనకు తెలిసిన వ్యక్తులు జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన కారణంగా వారి కోసం ప్రచారం చేశారా అన్నది తెలియాల్సి ఉంది.